పవన్ కల్యాణ్ కి స్వాతంత్రం వచ్చిందా..? వైసీపీ కౌంటర్లు..
ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని పవన్, భారత స్వాతంత్రం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ నుంచి తమకు ఎప్పుడు స్వతంత్రం వస్తుందా అని జనసైనికులు ఎదురుచూస్తున్నారంటూ అమర్నాథ్ కౌంటర్లిచ్చారు

స్వాతంత్ర దినోత్సవ వేళ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పవన్ చేసిన ప్రసంగానికి జగన్ టీమ్ కౌంటర్లు ఇచ్చింది. 2024 ఎన్నికల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదం అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని పవన్, భారత స్వాతంత్రం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ నుంచి తమకు ఎప్పుడు స్వతంత్రం వస్తుందా అని జనసైనికులు ఎదురుచూస్తున్నారంటూ అమర్నాథ్ కౌంటర్లిచ్చారు.
జనసేనను ఎన్ని సీట్లలో ఆశీర్వదించాలి..
ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వండి, వైసీపీ ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేసిందంటూ పవన్ కల్యాణ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఒకవేళ జనం నిజంగానే జనసేనకు ఓటు వేయాలనుకుంటే.. ఆయన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో స్పష్టంగా తెలియదని ఎద్దేవా చేశారు అమర్నాథ్. 2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందా..? దీనికి ముందు పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంతంగా అన్ని స్థానాలలో పోటీ చేసే స్వతంత్రం లేని జనసేనను ప్రజలు ఎలా ఆశీర్వదించాలి, ఎన్ని సీట్లలో ఆశీర్వదించాలి అంటూ చెణుకులు విసిరారు.
సీఎం జగన్ పరిపాలనతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజల సంతోషాన్ని చూడలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి అమర్నాథ్ పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు. కేవలం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం కోసం పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి వల్ల ఏపీకి ఎలాంటి మేలు జరగదని, ఏదైనా లాభం ఉంటే అది జనసేనకు కూడా కాదు, టీడీపీకేనని అన్నారు.