Telugu Global
Andhra Pradesh

టీ, కుర్చీ.. ఓ పసుపు బిళ్ల

పసుపు బిళ్ల తీసుకెళ్తే చాలు పనులైపోతాయంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

టీ, కుర్చీ.. ఓ పసుపు బిళ్ల
X

కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, వారి కష్టాలు తొలగిపోయాయని హింటిచ్చేందుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు అచ్చెన్న. అలా పసుపు బిళ్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి, టీ ఇచ్చి.. వారికి ఏపని కావాలో అది చేసి పెడతారన్నారు. అలా తాను అధికారులకు ఆదేశీలిస్తానని చెప్పారు అచ్చెన్నాయుడు. పసుపు బిళ్ల తీసుకెళ్తే పనులైపోతాయంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.


నా మాట వినకపోతే..

పసుపు బిళ్ల తీసుకెళ్లినా కూడా పనులు కాకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతానని కూడా చెప్పారు అచ్చెన్నాయుడు. తన మాట వినని అధికారులు ఏమవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారాయన. ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు అవస్థలు పడ్డారని, ఐదేళ్లు వారు అవమాన పడ్డారని గుర్తు చేశారు. ఇకపై ఎస్సై దగ్గరికి వెళ్లినా, ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా, ఎంపీడీవో దగ్గరకు వెళ్లినా టీడీపీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందన్నారు అచ్చెన్నాయుడు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఈ దశలో అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేసినా.. అధికారుల్ని హెచ్చరించడం మాత్రం సరికాదని అంటున్నారు కొందరు నెటిజన్లు. కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అందర్నీ సమానంగా చూడాలంటున్నారు.

First Published:  18 Jun 2024 11:10 AM IST
Next Story