చంద్రబాబును వెనక్కు లాగుతున్నారా? కొత్త ట్విస్టా?
ఏపీకి చెందిన తమ్ముళ్ళు కొందరు చంద్రబాబుతో భేటీ అయ్యారట. అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టద్దని గట్టిగా చెప్పారట. ఎలాగూ తెలంగాణలో పార్టీ ఎత్తిపోయింది అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు కెలుక్కోవటం అని నేరుగానే అడిగారట.
చంద్రబాబు నాయుడును ముందుకు పోవద్దని చెప్పి చాలామంది సీనియర్ తమ్ముళ్ళు వెనక్కులాగుతున్నట్లు సమాచారం. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంత మందిని పోటీ చేయించాలనే విషయమై ఇంకా నిర్ణయమైతే తీసుకోలేదు. అయితే ఎన్ని నియోజకవర్గాల్లో పార్టీ గట్టిగా ఉంది? ఎంతమంది గట్టి అభ్యర్ధులు దొరుకుతారు అనే విషయంలో మాత్రం కసరత్తు జరుగుతోంది.
సరిగ్గా ఇక్కడే ఏపీకి చెందిన తమ్ముళ్ళు కొందరు చంద్రబాబుతో భేటీ అయ్యారట. అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టద్దని గట్టిగా చెప్పారట. ఎలాగూ తెలంగాణలో పార్టీ ఎత్తిపోయింది అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు కెలుక్కోవటం అని నేరుగానే అడిగారట. ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది పాయింట్ కాకపోయినా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవదనే విషయంపైనే చర్చ జరిగిందట. ఈ మధ్యనే చంద్రబాబు చేయించుకున్న సర్వే ప్రకారం మహా అయితే ఓ 20 నియోజకవర్గాల్లో టీడీపీకి తలా 5 వేల ఓట్లున్నట్లు తేలిందట.
ఈ ఓట్లతో అయ్యేది లేదు పోయేది లేదని దీన్ని చూపించి బీజేపీతో బేరాలాడుకోవటం కూడా అనవసరమే అని తమ్ముళ్ళు గట్టిగానే చెప్పారట. ఎందుకంటే టీడీపీ ఓట్లపైన బీజేపీ ఏమీ ఆధారపడటంలేదన్న విషయం అర్ధమవుతోంది. ఇదే సమయంలో కమ్మోరి మద్దతు కావాలని కూడా బీజేపీ నేతలు అనుకోవటంలేదట. ఎందుకంటే టీడీపీకి చెందిన మెజారిటి కమ్మ నేతలు బీఆర్ఎస్‌లో సెటిల్ అయిపోయారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్ళీ యాక్టివ్ అవటం వల్ల ఏపీకే నష్టమని తమ్ముళ్ళు అభిప్రాయపడ్డారట.
తెలంగాణలో గనుక టీడీపీ మీద దెబ్బపడిందంటే దాని ప్రభావం ఏపీ మీద కూడా పడుతుందని అప్పుడు పార్టీ పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిలాగ తయారవుతుందని మెజారిటి తమ్ముళ్ళు చంద్రబాబుకు నచ్చచెబుతున్నారట. ముందు ఏపీలో అధికారంలోకి వచ్చే విషయాన్ని చూసుకుంటే తర్వాత తెలంగాణ సంగతి ఆలోచించవచ్చని కూడా గట్టిగా చెప్పారట. మరి చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.