పోలీసులు అడ్డుకుంటే అమరావతి యాత్ర ఇంతకాలం సాగేదా..? - ఏపీ హోం మంత్రి తానేటి వనిత
పాదయాత్ర చేస్తున్నది రియల్ ఎస్టేట్ దళారులే అయినప్పటికీ.. కోర్టు ఆదేశాల మేరకు యాత్రకు పోలీసులు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నారని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.
అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్రలో నిజమైన రైతులు ఎవరూ లేరని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. గురువారం తాడేపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. యాత్రలో పాల్గొంటున్నవారంతా రియల్ ఎస్టేట్ దళారులేనని హోం మంత్రి స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినవారే ఈ యాత్రలో పాల్గొంటున్నారని వనిత తెలిపారు.
పాదయాత్ర చేస్తున్నది రియల్ ఎస్టేట్ దళారులే అయినప్పటికీ.. కోర్టు ఆదేశాల మేరకు యాత్రకు పోలీసులు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నారని ఆమె తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారని వనిత వెల్లడించారు. పోలీసులు భద్రత కల్పించారు కాబట్టే యాత్ర ఇన్ని నియోజకవర్గాలు దాటుకుని ప్రశాంతంగా ముందుకు సాగిందని వివరించారు. పోలీసులు అడ్డుకుంటే అమరావతి పాదయాత్ర ఇంతకాలం సాగేదా అని హోం మంత్రి ప్రశ్నించారు.
ఇది రైతన్నల ముసుగులో చేస్తున్న పాదయాత్ర అని, అయినా కోర్టు నుంచి వారు తెచ్చుకున్న ఆదేశాల మేరకు పాదయాత్రకు భద్రత కల్పిస్తున్నామని వనిత తెలిపారు. పాదయాత్రకు అక్కడక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రజలను పక్కకు తప్పించి, పాదయాత్ర సజావుగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆమె వివరించారు.