కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా..?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధించేందుకే పోలీస్ వ్యవస్థను వాడుకున్నారని విమర్శించారు హోం మంత్రి అనిత. తనపై 23 కేసులు పెట్టారన్నారు.
ఏపీలో కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు తాము కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా అని ప్రశ్నించారు హోం మంత్రి వంగలపూడి అనిత. రెడ్ బుక్ అనేది కక్షసాధింపు చర్యలకోసం కాదని వివరించారామె. పగ, ప్రతీకారాల ఆలోచనే తమకు లేదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పట్టించుకోని అధికారులపై మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అనిత. డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమైన ఆమె.. పోలీస్ వ్యవస్థలో తీసుకు రాబోతున్న మార్పులను వివరించారు.
పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు..
గత వైసీపీ ప్రభుత్వంపై హోం మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. కేవలం బందోబస్తు కోసమే వారిని వాడుకున్నారని, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీస్ అకాడమీ నిర్మించలేదన్నారు అనిత. భవిష్యత్ రాజధానిగా వైసీపీ ప్రొజెక్ట్ చేసిన విశాఖ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్ రేకుల షెడ్డులోనే నడుస్తోందని, దానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు హోం మంత్రి అనిత.
ఈరోజు మంగళగిరి డీజీపీ కార్యాలయం లో డీజీపీ మరియు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన హోం మినిస్టర్ శ్రీమతి శ్రీ వంగలపూడి అనితగారు...సమావేశం లో మహిళా భద్రత కి ప్రాముఖ్యత ఇవ్వాలి అని, గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, ఇతర అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపాలి అని ,… pic.twitter.com/1bB6pGhv0Z
— Anitha Vangalapudi (@Anitha_TDP) June 27, 2024
ఏపీలో గంజాయి నిర్మూలించేందుకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తామన్నారు హోం మంత్రి. ప్రజల భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుందన్నారు. ట్రైనింగ్ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టారని, వారిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు అనిత. ప్రజలు ధైర్యంగా స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకొనేలా భరోసా ఇస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అమలు చేస్తామన్నారు.
నాపై 23కేసులు..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై కేసులు పెట్టి వేధించేందుకే పోలీస్ వ్యవస్థను వాడుకున్నారని విమర్శించారు హోం మంత్రి అనిత. తనపై 23 కేసులు పెట్టారన్నారు. సోషల్ మీడియాలో నేటికీ తాను బాధితురాలినేనని అన్నారామె. కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని చెప్పారు. ఏపీలో దిశ చట్టమే లేదని, దిశ పోలీస్ స్టేషన్ల పేరు కూడా మార్చబోతున్నామని తెలిపారు హోం మంత్రి అనిత.