Telugu Global
Andhra Pradesh

ఏపీ ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు

డిగ్రీ విద్య అంతంతమాత్రంగానే ఉన్న ఈ సమయంలో ప్రభుత్వమే అడ్మిషన్లకు అడ్డుపడటం సరికాదంటున్నాయి యాజమాన్యాలు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి.

ఏపీ ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
X

విద్యార్థులంతా ఇంటర్ తర్వాత బీటెక్ పరమావధిగా భావిస్తున్న వేళ, డిగ్రీ చదువులు రాను రాను పూర్తిగా తగ్గిపోతున్నాయి. అయితే ఉన్నట్టుండి ఏపీలో 150 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నిర్ణయాన్ని దాని అమలుకోసం ఇచ్చిన జీవోను ఈరోజు ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఆయా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ తిరిగి మొదలు కాబోతోంది.

జీవో నెంబర్ 24...

ఏపీలో మొత్తం 1008 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు చాలా చోట్ల అడ్మిషన్లు పడిపోయాయి. అడ్మిషన్ల సంఖ్య 25శాతం కంటే తక్కువగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లో ఈఏడాది అసలు అడ్మిషన్లే చేపట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఫీజులు నిర్ణయించకుండా ఆపేసింది. అడ్మిషన్లు వద్దంటూ జీవో 24 జారీ చేసింది. అడ్మిషన్లు తగ్గిపోతే పూర్తిగా కోర్సులు ఆపేయమంటే ఎలా అంటూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కోర్టుకెక్కాయి. అడ్మిషన్ల సంఖ్యకు ఫీజులు నిర్ణయించకపోవడానికి సంబంధమేంటని ప్రశ్నించాయి. అడ్మిషన్లు తక్కువగా ఉన్నా.. వచ్చే ఏడాదిపై ఆశతో తాము క్లాసులు నడుపుతామని అవకాశమివ్వాలని హైకోర్టుని ఆశ్రయించాయి. వారికి అనుకూలంగా ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయా కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టాలని సూచిస్తూ జీవో 24ని హైకోర్టు సస్పెండ్ చేసింది.

105 కాలేజీలకు ఊరట..

హైకోర్టు తీర్పుతో 105 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు ఊరట లభించింది. ఆన్ లైన్ కౌన్సెలింగ్ కి ఆయా కాలేజీలు సిద్ధమవుతున్నాయి. డిగ్రీ విద్య అంతంతమాత్రంగానే ఉన్న ఈ సమయంలో ప్రభుత్వమే అడ్మిషన్లకు అడ్డుపడటం సరికాదంటున్నాయి యాజమాన్యాలు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి.

First Published:  19 July 2023 10:05 PM IST
Next Story