ప్రభుత్వం పవర్ ప్రజలెప్పుడు తీయాలి..? ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
గ్రానైట్ పరిశ్రమకు కరెంటు సరఫరా పునరుద్ధరించకపోవడం మొదటి తప్పయితే, దాన్ని కప్పి పుచ్చుకోడానికి కోర్టుకి రాకుండా తప్పించుకోడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేయడం రెండో తప్పుగా భావించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ ప్రభుత్వానికి గతంలో హైకోర్టు అక్షింతలు, తలంటులు కామన్ గా కనిపించేవి, ఇటీవల అవి కాస్త తక్కువయ్యాయి. మళ్లీ ఇప్పుడు వరుసగా హైకోర్టులో అధికారులకు చుక్కలు కనపడుతున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టు వినాలో, న్యాయస్థానం ఆదేశాలు పాటించాలో తెలియక చివరకు హైకోర్టులో చీవాట్లు తినాల్సి వస్తోంది అధికారులు. తాజాగా.. అధికారులతోపాటు, ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా ఆక్షేపించింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వం పవర్ ప్రజలు ఎప్పుడు తీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అసలేం జరిగింది..?
రూ.40 లక్షలకు పైగా విద్యుత్ బిల్లు బకాయి ఉండటంతో ప్రకాశం జిల్లా వీఎల్ గణపతి గ్రానైట్స్ పరిశ్రమకు అధికారులు కరెంట్ కట్ చేశారు. దీంతో యాజమాన్యం కోర్టుని ఆశ్రయించింది. ఆ పరిశ్రమపై ఆధారపడినవారి జీవనాధారం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిసెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయకుండా, విచారణకు రాకుండా సాకులు చెప్పారు అధికారులు. కోర్టు ఉత్తర్వులు స్వీకరించడానికి నిరాకరించడంతోపాటు, న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తాము రికార్డ్ చేశామంటూ పిటిషనర్లు, ఆధారాలను కోర్టుకి సమర్పించారు. దీంతో కోర్టు ఈ కేసుని తీవ్రంగా పరిగణించింది.
గ్రానైట్ పరిశ్రమకు కరెంటు సరఫరా పునరుద్ధరించకపోవడం మొదటి తప్పయితే, దాన్ని కప్పి పుచ్చుకోడానికి కోర్టుకి రాకుండా తప్పించుకోడానికి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేయడం రెండో తప్పుగా భావించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రూ.40 లక్షల బకాయి కోసం గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ సరఫరా ఆపేసిన ప్రభుత్వం, కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు బకాయిలున్నమాట వాస్తవం కాదా అని గుర్తు చేసింది. లక్షల కోట్లు బకాయిలున్న ప్రభుత్వ పవర్ ను ప్రజలు ఎప్పుడు తీయాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనంగా ప్రకటిస్తుంటే, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పింఛన్ దారులు బకాయిల కోసం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారని నిలదీసింది. బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను దొంగల్లా తయారుచేస్తోందని మండిపడింది.
మొత్తమ్మీద హైకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అటు కోర్టు వ్యాజ్యాలతో, ఇటు ప్రభుత్వ విధానాలతో అధికారులు సతమతం అవుతున్నారనేది మాత్రం వాస్తవం. పదే పదే కోర్టుతో అధికారులు చీవాట్లు తినాల్సి వస్తోంది.