Telugu Global
Andhra Pradesh

నెల్లూరు కోర్టు చోరీ కేసు సీబీఐకి అప్పగింత

కేసుకు సంబంధించిన ఆధారాలున్న బ్యాగ్‌ను దొంగలు చోరీ చేశారు. అయితే బ్యాగ్‌లోని పత్రాలను కోర్టు బయటే పడేసి వెళ్లారు. ఈ పని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డే చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.

నెల్లూరు కోర్టు చోరీ కేసు సీబీఐకి అప్పగింత
X

ఈ ఏడాది ఏప్రిల్‌లో సంచలనం సృష్టించిన నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. ఈ కేసులో పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐకి అప్పగించడం మంచిదని నెల్లూరు జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐకి ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం కూడా హైకోర్టుకు స్పష్టం చేశారు. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం వెల్లడించింది.

ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి గతంతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తనకు వ్యతిరేకంగా ఫోర్జరీ పత్రాలను సృష్టించారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలున్న బ్యాగ్‌ను దొంగలు చోరీ చేశారు. అయితే బ్యాగ్‌లోని పత్రాలను కోర్టు బయటే పడేసి వెళ్లారు. ఈ పని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డే చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కాకాణి ఖండించడంతో పాటు ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పారు.

ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. నెల్లూరు కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి అప్పగించింది. ఆ కేసునైనా సీబీఐ తేలుస్తుందో లేదో చూడాలి.

First Published:  24 Nov 2022 12:59 PM IST
Next Story