Telugu Global
Andhra Pradesh

గ్రూప్-1 రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చొరవతో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యోగాల్లో ఉన్నవారికి యథాతథ స్థితిని కల్పించింది ఏపీ హైకోర్టు.

గ్రూప్-1 రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు
X

ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్-1 నియామకాల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై పాక్షిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికి ఊరట లభించింది. 2018 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ప్రస్తుతానికి ఎన్నికల విధుల్లో కూడా కొనసాగే అవకాశముంది.

అసలేమైంది..?

2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడదల చేసింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో పరీక్షలు, నియామకాలు కూడా పూర్తయ్యాయి. విజేతలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్ కరెక్షన్ పై కొన్ని అభ్యంతరాలు బయటకొచ్చాయి. నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ కొంతమంది కోర్టుకెళ్లారు. ఆ కేసు విచారణ ఇటీవలే పూర్తయింది. గ్రూప్-1 మెయిన్స్ ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీంతో రాజకీయ రగడ మొదలైంది. వైసీపీ హయాంలో మెయిన్స్ జరిగిందని, పక్షపాతంగా వ్యవహరించారని, వైసీపీకి కావాల్సిన వారికి పోస్టింగ్ లు ఇచ్చారని టీడీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. సింగిల్ జడ్జి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా స్టే విధించింది.

2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు తెచ్చుకున్నవారు సింగిల్ జడ్జి తీర్పుతో డైలమాలో పడ్డారు. మెయిన్స్ పరీక్ష రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహిస్తారన్న వార్తలతో వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయనే అనుమానాలు మొదలయ్యాయి. వీరిలో చాలామంది ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. అలాంటి వారిని పక్కనపెట్టాలా, కొనసాగించాలా అనే డైలమాలో పడ్డారు జిల్లా కలెక్టర్లు. ఈ దశలో ప్రభుత్వం 2018 గ్రూప్-1 రిక్రూటీలకు భరోసా ఇచ్చింది. న్యాయం చేస్తామని చెప్పింది. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చొరవతో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే వచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యోగాల్లో ఉన్నవారికి యథాతథ స్థితిని కల్పించింది ఏపీ హైకోర్టు.

First Published:  21 March 2024 1:41 PM IST
Next Story