ప్రభుత్వ ఉద్యోగుల సంఘం షోకాజ్ నోటీసుపై హైకోర్ట్ స్టే..
ఉద్యోగ సంఘం నేతల టిషన్ పై విచారణ జరిపిన కోర్టు షోకాజ్ నోటీసులపై స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తమకు ఒకటో తేదీ జీతాలు ఇప్పించేలా చూడండి అంటూ గవర్నర్ కి విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోకాజ్ ని రద్దు చేయాలంటూ సదరు ఉద్యోగ సంఘం నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు షోకాజ్ నోటీసులపై స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు, బకాయిలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొంతమంది నేతలు ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో రాజ్ భవన్ లో ఉండే కీలక అధికారిపై కూడా వేటు వేసింది. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇప్పించడంలో సదరు అధికారి, ఉద్యోగ సంఘాల నేతలకు సహాయం చేశారనే అనుమానంతో ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఇతర సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారంటూ మరో సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తున్న దశలో ఈ ఫిర్యాదులెందుకని ప్రశ్నించారు. ఈ గొడవ జరిగిన మరుసటి నెలలోనే ఉపాధ్యాయుల జీతాలు 10రోజులకు పైగా ఆలస్యమయ్యాయి. దీంతో ఏపీలో జీతాల ఆలస్యంపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. మరోవైపు ప్రభుత్వం షోకాజ్ ఇచ్చినా కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెనక్కు తగ్గలేదు. ఈ వ్యవహారంలో షోకాజ్ నోటీసుపై హైకోర్టు స్టే విధించడం కీలక పరిణామం.