ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే
ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్టు స్టే విధించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడం నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల కొందరు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. స్టే విధిస్తూ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఉంది
ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది. డీఎస్సీ పరీక్షకు హాల్ టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ అప్రమత్తమయ్యారు. మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని అభ్యర్థించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టు డీఎస్సీపై స్టే విధించకుండా ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారిని అనుమతించడంపైనే స్టే ఇచ్చింది.