Telugu Global
Andhra Pradesh

అమరావతి యాత్ర సాగేనా..? తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

తమకు వెసులుబాటు ఇస్తుందని అమరావతి రైతులు ఆశ పెట్టుకున్నారు. హైకోర్టు అనుమతిస్తే వెంటనే యాత్ర మొదలు పెట్టడానికి సరంజామా రెడీ చేసుకున్నారు. అయితే తీర్పు రిజర్వ్ కావడంతో యాత్ర డైలమాలో పడింది.

అమరావతి యాత్ర సాగేనా..? తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
X

ఇప్పటి వరకు అమరావతి రైతులకు ఏపీ హైకోర్టు అండగా నిలబడింది. యాత్రకు పర్మిషన్ లేదని పోలీసుల చెప్పినా, కోర్టు అనుమతితో బయలుదేరారు రైతులు. అమరావతి నుంచి అరసవెల్లి ప్రయాణం కట్టారు, 500కిలోమీటర్ల మేర యాత్ర చేశారు. అయితే మధ్యలో ఆటంకాలతో అర్థాంతరంగా యాత్ర ఆపేసి మళ్లీ కోర్టు మెట్లెక్కారు. ఐడీ కార్డులు చూపాలనడంతో దొంగ యాత్ర గుట్టు రట్టయిందని, అందుకే ఆపేశారంటూ వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఈ క్రమంలో యాత్రకు ఆటంకాలు లేకుండా చేయాలని, అసలు యాత్రని నిలువరించాలంటూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తీర్పు రిజర్వ్ చేసింది.

యాత్రలో పాల్గొనేందుకు 600మంది రైతులకు మాత్రమే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారంతా ఐడీకార్డ్ లు ధరించాలి. పోలీసులు అడిగితే వాటిని చూపించాలి. కానీ, పోలీసుల తనిఖీల్లో చాలామంది వద్ద కార్డులు లేవు, దీంతో రైతులంతా ఓరోజు తాము బస చేసిన ప్రాంతానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత కోర్టు రక్షణ కోరి యాత్ర ఆపేశారు. 600మందిలో ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే, వారి బదులు మరొకరు యాత్ర చేస్తారని.. దానికి పర్మిషన్ కావాలని కోరారు. పదే పదే ఐడీకార్డులంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు యాత్రను అడ్డుకుంటున్నారని అన్నారు.

ఇక యాత్రను నిలువరించాలంటూ ఏపీ డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. అనుమతి లేనివారు యాత్రలో పాల్గొంటున్నారని, వారంతా స్థానికుల్ని రెచ్చగొడుతున్నారని, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఈ పిటిషన్లో హైకోర్టుకి వివరించారు. వాడి వేడిగా వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు విచారణ పూర్తి చేసినట్టు ప్రకటించింది. అయితే తీర్పుని రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

యాత్రను హైకోర్టు అడ్డుకునే పరిస్థితి ఉండదు అనుకున్నా.. తమకు వెసులుబాటు ఇస్తుందని మాత్రం అమరావతి రైతులు ఆశ పెట్టుకున్నారు. హైకోర్టు అనుమతిస్తే వెంటనే యాత్ర మొదలు పెట్టడానికి సరంజామా రెడీ చేసుకున్నారు. అయితే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో యాత్ర మళ్లీ డైలమాలో పడింది.

First Published:  29 Oct 2022 8:21 AM IST
Next Story