Telugu Global
Andhra Pradesh

షర్మిల, సునీతకు ఏపీ హైకోర్టు అక్షింతలు

వీరి పిటిషన్ల విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని షర్మిల, బీటెక్ రవి, సునీతను ప్రశ్నించింది హైకోర్టు.

షర్మిల, సునీతకు ఏపీ హైకోర్టు అక్షింతలు
X

కోర్టులో విచారణ జరుగుతుండగా ఆ కేసుపై వ్యాఖ్యానాలు చేయడం చట్ట విరుద్ధం. కోర్టు తీర్పుని ప్రభావితం చేసేలా మాట్లాడటం, వార్తలు రాయడం కూడా తప్పే. అందుకే వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఉత్తర్వులిచ్చింది. పైగా హంతకుడు ఫలానా, హత్యచేయించింది ఫలానా.. అంటూ తామే తీర్పునిచ్చేసినట్టు మాట్లాడుతున్నారు షర్మిల, సునీత. వారికి వంతపాడుతూ టీడీపీ నేతలు కూడా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిందలు వేస్తున్నారు. దీంతో కడప కోర్టు ఆ కేసు గురించి మాట్లాడొద్దని ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు షర్మిల, సునీత, టీడీపీ నేత బీటెక్ రవి. అలా సవాల్ చేసి మరీ హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు ఆ ముగ్గురు.

వీరి పిటిషన్ల విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని షర్మిల, బీటెక్ రవి, సునీతను ప్రశ్నించింది హైకోర్టు. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది. కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని ప్రశ్నించింది హైకోర్టు. హంతకుడు అనే ముద్ర వేయడంతోపాటు, హంతకుడ్ని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారని అడిగింది. అలా చెప్పటం తప్పు కాదా అని ప్రశ్నించిన హైకోర్టు, వారి వ్యాఖ్యలు నేరపూరితమైన చర్యల కిందకు వస్తాయని హెచ్చరించింది. అసలు ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడెందుకిలా మాట్లాడుతున్నారని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు.

కేవలం ఈ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే వైఎస్ వివేకా హత్యకేసుని హైలైట్ చేస్తున్నారని తెలుస్తోంది. కడపలో అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల, ఆయనపై హంతకుడనే ముద్రవేసి తాను లాభపడాలని చూస్తున్నారు. పనిలో పనిగా టీడీపీకి కూడా పరోక్ష సాయం చేస్తున్నారు షర్మిల. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై వ్యాఖ్యానాలు చేయడంతోపాటు, వద్దని వారించిన కింది కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేయడం మరీ వింతగా తోస్తుంది. అయితే హైకోర్టు మాత్రం ఊహించినట్టుగానే కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన ఆ ముగ్గురికీ అక్షింతలు వేసింది.

First Published:  3 May 2024 6:21 PM IST
Next Story