రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపైనే హైకోర్టు ప్రశ్న
ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఒకటి కాదు కదా అని ప్రశ్నించింది. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సీఆర్‌డీఏను ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుందని కోర్టు ప్రశ్నించింది.
రాజధానిలో భూములపై ఏపీ ప్రభుత్వ అధికారాలపై ఏపీ హైకోర్టు ప్రశ్నలు సంధించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల వారు కూడా రాజధానిలో ఇళ్ల స్థలాలు పొందేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టంలో ప్రభుత్వం తెచ్చిన సవరణను సవాల్ చేస్తూ అమరావతివాదులు హైకోర్టులో వెళ్లారు. ఈ పిటిషన్‌పై గురువారం కూడా వాదనలు కొనసాగాయి.
రాజధానిలో ధనవంతుల మాత్రమే ఉండాలనుకుంటున్నారని, అందుకే పేదలు అడుగు పెట్టకూడదని అడ్డుపడుతున్నారని వాదించారు. హైకోర్టు, సచివాలయం, హ్యాపీనెస్ట్ భవన నిర్మాణాలకూ భూములు కేటాయించారని, అప్పుడు అభ్యంతరం తెలపని వారు పేదల విషయంలో మాత్రమే ఎందుకు అభ్యంతరం తెలుపుకున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఒకటి కాదు కదా అని ప్రశ్నించింది. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సీఆర్‌డీఏను ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుందని కోర్టు ప్రశ్నించింది. సీఆర్‌డీఏ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారమే ప్రభుత్వానికి లేదని పిటిషన్లు వాదిస్తున్నారని దానికి ఏం సమాధానం చెబుతారని కోర్టు అదనపు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
రాజధాని ప్రాంతంలో 5 శాతం భూమిని పేదలకు కేటాయించే అధికారం చట్ట ప్రకారమే ఉందని సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. అసలు ఒకసారి ప్రభుత్వానికి భూములు ఇచ్చిన తర్వాత వాటిపై రైతులకే హక్కు ఉండదని ఏఏజీ వాదించారు. సీఆర్‌డీఏ, ప్రభుత్వం వేర్వేరు కదా.. అలాంటప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఆర్‌డీఏను ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుందో సమాధానం చెప్పాలన్న హైకోర్టు వ్యాఖ్యలు కీలకంగా ఉన్నాయి. ఒకవేళ అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు, అధికారాలు ఉండవు అన్నప్పుడు.. మరి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్లు అవసరమైన లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతి కోసం ఎందుకు ఖర్చు చేయాలి అన్న ప్రశ్న కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.