ఏపీ మాజీ మంత్రి నారాయణ సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
చంద్రబాబును ఏ1గా, నారాయణను ఏ2గా పేర్కొంటూ సీఐడీ విచారణ ప్రారంభించింది. సీఆర్‌పీసీ 160 కింద నారాయణకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిచారు.
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారాయణను సీఐడీ పోలీసులు విచారించడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నారాయణ నివాసంలోనే ఆయనను సీఐడీ అధికారులు విచారించాలని ఏపీ హైకోర్టు షరతులు విధించింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగురోడ్డుకు సంబంధించిన అలైన్‌మెంట్‌లో అనేక మార్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మే 10న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి సీఎం చంద్రబాబు సహా మున్సిపల్ శాఖ మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
చంద్రబాబును ఏ1గా, నారాయణను ఏ2గా పేర్కొంటూ సీఐడీ విచారణ ప్రారంభించింది. సీఆర్‌పీసీ 160 కింద నారాయణకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిచారు. కాగా, సీఐడీ నోటీసులను నారాయణ ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. నారాయణ చికిత్స చేయించుకున్నారని.. ఆయన బయటకు రాలేరని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. దీంతో నారాయణను ఇంట్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, కోర్టు అనుమతితోనే నారాయణ అమెరికాలో చికిత్స తీసుకొని రావడం గమనార్హం.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబు, నారాయణలపై 120బీ, 420, 34, 36, 37, 166 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్‌రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలైన్‌మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్‌కు లబ్ది చేకూర్చారని ఆర్కే తన ఫిర్యాదులో ఆరోపించారు.
అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్‌మెంట్ మార్పునకు సహకరించినట్లు ఆళ్ల ఆరోపిస్తున్నారు. ఇదంతా తమ సొంత వారి భూములు కాపాడుకునే ప్రయత్నమేనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో నారాయణకు హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది. కాగా, ఈ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నవంబర్ 30లోగా నారాయణ లొంగిపోవాలి..
మరోవైపు టెన్త్ పత్రాల లీక్ కేసులో నారాయణకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చిత్తూరు జిల్లా నెల్లేపల్లి హైస్కూల్‌లో లీకైన టెన్త్ క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్.. ఆ తర్వాత వాట్సప్‌లో కనిపించింది. దీని వెనుక నారాయణ ఉన్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, 2014లోనే నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఆయన తప్పుకున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్‌ను చిత్తూరు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దు చేసింది. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.