Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేను కోర్టుకు రప్పించే పరిస్థితి తేవద్దు..

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామం సమీపంలో గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఎమ్మెల్యేను కోర్టుకు రప్పించే పరిస్థితి తేవద్దు..
X

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామం సమీపంలో గ్రావెల్ తవ్వకాల వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మైనింగ్ ఆపాలని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా తవ్వకాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించింది. తోటపల్లి గ్రామం పరిధిలోని 8.50 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వుకునేందుకు బోయపాటి బసవపూర్ణయ్యకు తాత్కాలిక అనుమతులను గనులశాఖ మంజూరు చేసింది. మైనింగ్‌కు అనుమతులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చింది. ఆ తర్వాత మైనింగ్ సంస్థ కోర్టుకు వెళ్లగా మైనింగ్‌ను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించింది.

సింగిల్ జడ్జి మైనింగ్‌కు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ముందుకు పిటిషనర్లు వెళ్లారు. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. ఇటీవల మైనింగ్‌ను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. అయితే మరోసారి ఈ పిటిషన్ విచారణకు రాగా... కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మైనింగ్‌ కొనసాగుతోందని.. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు పహారా మధ్య మైనింగ్ జరుగుతున్న ఫొటోలను కోర్టుకు సమర్పించారు. వాటిని చూసిన కోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. తక్షణం అక్కడ మైనింగ్‌ను అడ్డుకోవాలని డీజీపిని ఆదేశించింది. మైనింగ్‌ను అడ్డుకోని పక్షంలో డీజీపీని కూడా కోర్టు రప్పిస్తామని హెచ్చరించింది.

మైనింగ్ వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని పిటిషనర్లు ఆరోపించగా.. ఎమ్మెల్యే పాత్రను కూడా తేలుస్తామని.. ఎమ్మెల్యేను కూడా కోర్టుకు పిలవాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోర్టు హెచ్చరించింది.

First Published:  17 Sept 2022 4:15 AM GMT
Next Story