Telugu Global
Andhra Pradesh

తెర వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు - ఏపీ హైకోర్టు

హైకోర్టు రిజిస్ట్రీ వ్యవహారాలను థర్డ్ పార్టీ ప్రభావితం చేస్తోందని, ఏ కేసు ఏ ధర్మాసనం విచారించాలో నిర్ణయిస్తోందని హైకోర్టు ఆరోపించింది. తెర వెనుక సాగుతున్న వ్యవహారంపై విచారణ చేయిస్తామంటూ హెచ్చరించింది.

తెర వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు - ఏపీ హైకోర్టు
X

రాష్ట్రంలో రహదారులపై సభలు, సమావేశాలను నియంత్రిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్- 1 సస్పెండ్ చేసే సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి జీవోను తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 1861 నుంచి పోలీస్ చట్టం అమల్లో ఉందని, బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఇచ్చి ఉంటే స్వాతంత్ర ఉద్యమం జరిగేదా..? అని ప్రశ్నించింది.

బ్రిటీష్ కాలంలోనూ రాని ఇలాంటి జీవో ఇప్పుడు వచ్చిందంటే మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 75 ఏళ్లుగా ఎవరు రహదారులపై సభలు సమావేశాలు పెట్టలేదా..? అని ప్రశ్నించింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వీఆర్కే కృష్ణసాగర్ తో కూడిన ధర్మాసనం విచారించింది .

ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది అశ్విని కుమార్ బ్రిటీష్ ప్రభుత్వం కూడా 144 సెక్షన్ విధించింది గానీ, ఇలాంటి ఆదేశాలు ఎప్పుడూ ఇవ్వలేదని వాదించారు. నిషేధం అన్న పదం ఉపయోగించకుండానే సభలు, సమావేశాలను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారని, అలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని ఎలా నిరూపించుకోవాలని కోర్టులో వాదించారు. తమకు నచ్చిన వారికి అనుమతి ఇచ్చి, నచ్చని వారిని నియంత్రించేందుకే ఈ షరతు పెట్టారని ఆరోపించారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు. అత్యవసరంగా విచారించేందుకు చూపుతున్న కారణాలు సహేతుకం కాదన్నారు. విచారణ జరపడానికి వీల్లేదని.. పిటిషనర్ కోర్టు విచారణను దుర్వినియోగం చేస్తున్నారని వాదించారు. జీవో వచ్చిన తర్వాత ఏ పార్టీ అనుమతుల కోసం కూడా దరఖాస్తులు చేసుకోలేదని.. దరఖాస్తుల్ని పోలీసులు తిరస్కరించిన ఉదంతాలు లేవని కాబట్టి ఈ దశలో ఈ పిటిషన్ విచారణ సరికాదని ఏజీ వాదించారు.

అడ్వకేట్ జనరల్ వాదనపై హైకోర్టు కాస్త ఘాటుగానే స్పందించింది. ఏ పిటిషన్ అయినా విచారించే విచక్షణాధికారం కోర్టుకు ఉంటుందని వ్యాఖ్యానించింది. అత్యవసర విచారణకు అనుమతి ఇచ్చాక అసలు ఏంటి ప్రభుత్వ అభ్యంతరం అని కోర్టు ప్రశ్నించింది. అసలు ఈ కేసు విచారణ విషయంలో రిజిస్ట్రీ దగ్గర ఏం జరిగిందో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. తొలుత ఈ కేసు విచారణకు వచ్చేలా అధికారి ఆమోదించారని.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకొని అనుమతి తిరస్కరించారని కోర్టు చెప్పింది. ఈ పిటిషన్ విచారణకు రాకుండా తెర వెనుక ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో తమకు తెలుసని, ఈ విషయాన్ని తాము బెంచ్ మీద నుంచే బహిర్గతం చేసే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించింది.

హైకోర్టు రిజిస్ట్రీ వ్యవహారాలను థర్డ్ పార్టీ ప్రభావితం చేస్తోందని, ఏ కేసు ఏ ధర్మాసనం విచారించాలో నిర్ణయిస్తోందని హైకోర్టు ఆరోపించింది. తెర వెనుక సాగుతున్న వ్యవహారంపై విచారణ చేయిస్తామంటూ హెచ్చరించింది. ప్రజా ప్రయోజనం ముడిపడి ఉన్న ఈ పిటిషన్ను విచారించవద్దు అన్నది మీ అభిప్రాయమా..? అని అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది.

ఒకవేళ తమ ముందు వాదనలు వినిపించేందుకు ఇష్టం లేకపోతే చెప్పాలని పిటిషన్ ను వేరే బెంచ్ కు పంపుతామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు ఈ జీవోను సస్పెండ్ చేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.

First Published:  13 Jan 2023 9:10 AM IST
Next Story