పీఠాధిపతులు వారి పరిధులకు పరిమితం అయితే మంచిది- ఏపీ హైకోర్టు
పీఠాధిపతులు కేవలం వారి పరిధులకు పరిమితం అయితే మంచిదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే శ్రీకాంత్ నియామకంపై ఇదివరకు ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది.
ఏపీలో అధిక సంఖ్యలో సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తంతుకు ముగింపు ఎక్కడుందని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం చేసుకోవచ్చు గానీ.. శాఖల వారీగా సలహాదారులు ఏంటని ప్రశ్నించింది. ఐఏఎస్‌ల కంటే ఈ సలహాదారులు గొప్ప సలహాలు ఇస్తారా అని ప్రశ్నించింది. ఈ నియామకాలు రాజ్యాంగబద్దమో కాదో తేలుస్తామని చెప్పింది.
ఈ సలహాదారులకు ప్రజాధనం నుంచి జీతాలు ఏ ప్రతిపదికన చెల్లిస్తున్నారని ప్రశ్నించింది. మొత్తం ఎంతమంది సలహాదారులున్నారు.. వారు చేస్తున్న పనేంటి? వారు ఏయే శాఖల్లో ఉన్నారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఇష్టానుసారం సలహాదారులను నియమించడం చిన్న విషయం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో తహసీల్దార్‌కు కూడా ఒక సలహాదారుని నియమించేలా ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖ సలహాదారుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ బ్రహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధి రాజశేఖర్ రావు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శ్రీకాంత్‌ను సలహాదారుగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆయన్ను ఎందుకు ఎంపిక చేశారన్నది గానీ.. ఆయనకున్న అర్హతల గురించి కానీ ప్రస్తావించలేదని పిటిషన్‌ను వివరించారు. అయినప్పటికీ ప్రోటోకాల్ సౌకర్యాలు, నెలకు లక్షా 60వేల జీతం ఇస్తున్నారన్నారు.
దేవాలయాల నిర్వాహణపై శ్రీకాంత్‌కు పూర్తి అవగాహన ఉందని అందుకే ఆయన్ను సలహాదారుగా నియమించామని.. ఒక పీఠాధిపతి కూడా శ్రీకాంత్ నియామకానికి సలహా ఇచ్చారని అడ్వకేట్ జనరల్ శ్రీరాం చెప్పగా.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని పీఠాధిపతులు నడుపుతారా అని ప్రశ్నించింది. పీఠాధిపతులు కేవలం వారి పరిధులకు పరిమితం అయితే మంచిదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే శ్రీకాంత్ నియామకంపై ఇదివరకు ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. సలహాదారుల నియమాకం రాజ్యాంగ బద్ధమో కాదో తేలుస్తామని విచారణను వాయిదా వేసింది.