వీసీ ఓవరాక్షన్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
వీసీ రాజశేఖర్ రాజకీయాలు పక్కనపెట్టి, చేయాల్సిన పని సక్రమంగా చేయాలని హితవు పలికింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవో -1 పై వీసీ రాజశేఖర్ మీడియా సమావేశం పెట్టి సమర్థించడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఇటీవల కొందరు యూనివర్సిటీల వీసీల వ్యవహారం మాత్రం ఆహ్వానించ తగ్గట్టుగా లేదు. ప్రభుత్వ పెద్దల వద్ద మెప్పు పొందేందుకు రాజకీయ నాయకులు కంటే చురుగ్గా వ్యవహరిస్తున్నారు వీసీలు. పెద్దల మెప్పు పొందితే చాలు తమ పదవులకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశమో.. ఎవరేమనుకుంటే మాకేంటి అనే తెగింపో గానీ, వీసీలు కొందరు భజనపరులుగా మారిపోతున్నారు.
యూనివర్సిటీలో నాయకుల పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, క్యాంపస్ మొత్తం నేతల ఫ్లెక్సీలతో నింపేస్తున్నా.. వీసీలు అభ్యంతరం చెప్పకపోగా.. వారు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఈ జాడ్యం టిడిపి హయాంలో కూడా ఉంది. దాన్ని ఈ ప్రభుత్వంలోనూ కొందరు వీసీలు కొనసాగిస్తున్నారు. చేయాల్సిన పని చేయకుండా పెద్దల దృష్టిలో పడేందుకు రాజకీయ అంశాలపై మీడియా సమావేశాలు పెడుతున్నారు.
బీఈడీ కౌన్సిలింగ్ కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు కూడా ఇలాంటి వీసీల తీరును తప్పు పట్టింది. బీఈడీ కౌన్సిలింగ్ జాబితాలో తమ కాలేజీల పేర్లను కూడా చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొన్ని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఆయా కాలేజీల పేర్లను కౌన్సిలింగ్ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఆప్షన్లకు గడువును 31 వరకు పెంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.
వీసీ రాజశేఖర్ రాజకీయాలు పక్కనపెట్టి, చేయాల్సిన పని సక్రమంగా చేయాలని హితవు పలికింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవో -1 పై వీసీ రాజశేఖర్ మీడియా సమావేశం పెట్టి సమర్థించడాన్ని కోర్టు తప్పుపట్టింది. అసలు మీడియా సమావేశం పెట్టాల్సిన అవసరం వీసీకి ఎందుకొచ్చిందని నిలదీసింది. రాజకీయ విషయాలు పక్కన పెట్టి విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి సారించాలని సూచించింది. వీసీలు ఇలాంటి పనులు చేయడం గతంలో ఎప్పుడైనా చూసామా అని కోర్టు వ్యాఖ్యానించింది. వీసీలే ఇలా వ్యవహరించడం ద్వారా సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారని హైకోర్టు అభ్యంతరం తెలిపింది.