Telugu Global
Andhra Pradesh

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లు ఎందుకు.. ?

ఏ అధికారంతో గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు సబ్ రిజిస్ట్రార్ హోదాలో కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కేవలం సచివాలయాల సెక్రటరీలకు మాత్రమే అధికారాలు కట్టబెడితే సబ్ రిజిస్ట్రార్ కి ఎలాంటి విధులు అప్పగిస్తారని ప్రశ్నించింది.

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లు ఎందుకు.. ?
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో పాలనలో సంచలన మార్పులు తీసుకొచ్చింది. ప్రజల ముందుకు పాలన తెచ్చామని చెబుతున్నా.. సచివాలయాలతో అసలు ప్రయోజనం ఏంటనేది ఇంకా తేలలేదు. ఈలోగా సచివాలయాలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇటీవలే ఓటీఎస్ అంటూ వన్ టైమ్ సెటిల్మెంట్ విధానంలో, సచివాలయ పరిధిలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అవన్నీ తప్పుల తడకగా ఉన్నాయనేది వేరేవిషయం. ఇప్పుడు సచివాలయాలకు పొలాలు, స్థలాల రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. అక్టోబర్-2నుంచి ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాలనుకుంటున్న ఈ విధానంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

రిజిస్ట్రేషన్ ఆఫీస్ లు ఎందుకు.. ?

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలైతే ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లు ఎందుకు, గ్రేడ్-1 ఆఫీసర్ల నియామకం ఎందుకనేదే అసలు ప్రశ్న. పోనీ, సచివాలయాల స్థాయిలో అంతా పక్కాగా జరుగుతుందా అంటే అదీ లేదు. అక్కడ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండవు. సమగ్ర సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్లు ఏ అధికారంతో చేపడతారని ప్రశ్నిస్తున్నారు పిటిషనర్లు. గెజిటెడ్ ఆఫీసర్ స్థాయిలో జరగాల్సిన రిజిస్ట్రేషన్లను పంచాయతీ సెక్రటరీ స్థాయి ఉద్యోగితో ఎలా చేయిస్తారనే వాదన తెరపైకి తెచ్చారు. గ్రామస్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారాలు తీసివేయటం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

వారి అధికారం ఏంటి.. ?

ఏ అధికారంతో గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు సబ్ రిజిస్ట్రార్ హోదాలో కార్యకలాపాలు నిర్వహిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కేవలం సచివాలయాల సెక్రటరీలకు మాత్రమే అధికారాలు కట్టబెడితే సబ్ రిజిస్ట్రార్ కి ఎలాంటి విధులు అప్పగిస్తారని ప్రశ్నించింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సంబంధించి అధికారాలు కొనసాగిస్తున్నారా, లేదా అనేది తేల్చాలంటూ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

First Published:  14 Oct 2022 3:38 PM IST
Next Story