Telugu Global
Andhra Pradesh

బిగ్ బాస్ నచ్చకపోతే చూడటం మానేయండి -హైకోర్టు

బిగ్ బాస్ షో కంటే మించిన అశ్లీలత, అసభ్యత ఉండే కంటెంట్ ఇతర వేదికలపై అందుబాటులో ఉంటోంది కదా అని పిటిషనర్ ని ప్రశ్నించింది హైకోర్టు. బిగ్ బాస్ రియాల్టీ షో పై అభ్యంతరం ఉంటే చూడటం మానేయండని సలహా ఇచ్చింది.

బిగ్ బాస్ నచ్చకపోతే చూడటం మానేయండి -హైకోర్టు
X

టీవీలో వచ్చే బిగ్ బాస్ రియాల్టీ షో పై చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అశ్లీలత, అసభ్యతతో కూడిన బిగ్ బాస్ పై నిషేధం విధించాలంటూ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా కోర్టు మెట్లెక్కారు. ఈ విషయంలో ఇటీవల కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే నిర్మాత వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ నచ్చకపోతే చూడటం మానేయండని తెలిపింది.

అంతకంటే మించిన అశ్లీలత లేదా..?

బిగ్ బాస్ షో కంటే మించిన అశ్లీలత, అసభ్యత ఉండే కంటెంట్ ఇతర వేదికలపై అందుబాటులో ఉంటోంది కదా అని పిటిషనర్ ని ప్రశ్నించింది హైకోర్టు. వాటి విషయంలో ఏం చేస్తున్నారని అడిగింది. బిగ్ బాస్ రియాల్టీ షో పై అభ్యంతరం ఉంటే చూడటం మానేయండని సలహా ఇచ్చింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ పి.వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. ఎవరు ఏం మాట్లాడాలో చెప్పే పని కోర్టులది కాదని పేర్కొంది.

విచారణ ఆరు వారాలు వాయిదా..

బిగ్ బాస్ షో ప్రారంభం అయిన తర్వాత వేసిన ఈ పిటిషన్ల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు బిగ్ బాస్ రియాల్టీషో ప్రసారం కూడా పూర్తయింది. కొత్త షో కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ దశలో కోర్టు మరో ఆరువారాలపాటు ఈ కేసు విచారణ వాయిదా వేసింది. టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉన్నవాళ్లు, నేరుగా హైకోర్టుని ఆశ్రయించకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉందని బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం చేస్తున్న స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మా టీవీ ఎండీ కోర్టుకి విన్నవించారు. ఆ ప్రత్యామ్నాయాల వివరాలు తెలపాలని చెప్పిన కోర్టు, కౌంటర్ వేసేందుకు వారికి ఆరువారాల గడువు ఇస్తూ కేసు వాయిదా వేసింది.

First Published:  28 Jan 2023 9:42 AM IST
Next Story