పీవీసీ ఫ్లెక్సీలకు హైకోర్టు అనుమతి
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యానర్లకు మాత్రమే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పీవీసీ కోటింగ్ ఫ్లెక్సీలను తయారు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు మాత్రమే జీవో వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి బ్యానర్లపై మాత్రమే నిషేధం అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీవీసీ కోటింగ్‌తో తయారు చేసే ఫ్లెక్సీలకు అనుమతిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ ఫ్లెక్సీ తయారీదారుల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది.. ఈ రంగంపై వేలాది మంది ఆధారపడి బతుకుతున్నామని.. ప్రభుత్వ నిర్ణయంతో తామంతా జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడుతామని వారు కోర్టుకు వివరించారు. ఈ తరహా ఉత్తర్వులను దేశంలో మరే రాష్ట్రం ఇవ్వలేదన్నారు. సింగిల్ యూజ్డ్ ఫ్లెక్సీలపై ఎప్పటి నుంచో నిషేధం ఉందని.. వాటిని తాము కూడా తయారు చేయడం లేదని వివరించారు.
ఇందుకు స్పందించిన హైకోర్టు.. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యానర్లకు మాత్రమే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పీవీసీ కోటింగ్ ఫ్లెక్సీలను తయారు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై ఫ్లెక్సీ తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.