లక్ష కట్టండి లేదా జైలుకెళ్లండి.. తేల్చి చెప్పిన హైకోర్టు
తమ ఎత్తు ఫలానా అంటూ ఆయా ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి వాటిని కోర్టు ముందుంచడంపై కూడా హైకోర్టు మండిపడింది.
తప్పుడు ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినవారిపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌పై విచారణలో భాగంగా తాము చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే ఒక్కో అభ్యర్థి లక్ష రూపాయలు జరిమానా చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ప్రకారం జరిమానా లక్ష చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఏపీ హైకోర్టులో చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తమ ‘ఎత్తు’ను సరిగా కొలవలేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి ఎత్తు కొలతలను న్యాయస్థానంలోనే పరీక్ష చేయించిన న్యాయమూర్తి వారి వాదన అవాస్తవమని గుర్తించి పిటిషన్ కొట్టివేసింది. ఎస్‌ఐ అభ్యర్థుల నియామకాలపై ఇచ్చిన స్టేను కూడా తొలగించింది.
ఇదే క్రమంలో అవాస్తవ ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేసిన అభ్యర్థులకు న్యాయస్థానం షాకిచ్చింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై తాము చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలితే లక్ష రూపాయలు చొప్పున జరిమానా చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ రూ.లక్ష చెల్లించకుంటే కోర్టు ధిక్కారం కింద జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పింది. దీని వల్ల భవిష్యత్తులో ఏ పరీక్షకు కూడా హాజరయ్యే అవకాశం ఉండదని అభ్యర్థులను హెచ్చరించింది. తమకు అంత స్థోమత లేదని కొందరు అభ్యర్థులు చెప్పడంతో, అలాంటప్పుడు లక్ష జరిమానా చెల్లిస్తామని కోర్టుకు ఎందుకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని హైకోర్టు వారిని ప్రశ్నించింది. కోర్టు అంటే తమాషాగా ఉందా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో తమ ఎత్తు ఫలానా అంటూ ఆయా ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తెచ్చి వాటిని కోర్టు ముందుంచడంపై కూడా హైకోర్టు మండిపడింది. అసలు ప్రభుత్వ వైద్యులు దేని ఆధారంగా ఇలాంటి ధ్రువపత్రాలు ఇస్తారని ప్రశ్నించింది. వాటి యదార్థత పైనా దర్యాప్తు చేయాలని గుంటూరు ఐజీ పాలరాజును న్యాయస్థానం ఆదేశించింది. ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యులను విచారించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయంలో కోర్టును ఆశ్రయించిన 19 మంది అభ్యర్థులు తమ ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.