Telugu Global
Andhra Pradesh

అమరావతి టు కర్నూలు.. హైకోర్టు తరలింపుపై కేంద్రం తాజా స్పందన

ఏపీ హైకోర్టుని అమరావతిలోనే కొనసాగించాలా లేక కర్నూలుకి తరలించాలా అనేది న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారాయన.

అమరావతి టు కర్నూలు.. హైకోర్టు తరలింపుపై కేంద్రం తాజా స్పందన
X

వైసీపీ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులు అంటోంది, కేంద్రం కూడా రాజధానులు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నా రాజధానిపై ఏపీ ప్రభుత్వం లాజికల్ గా మాట్లాడుతోంది. ఈ దశలో ఏపీ హైకోర్టు వ్యవహారంపై కేంద్రం ఆసక్తికర సమాధానమిచ్చింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్టు తరలింపుపై ఆయన సమాధానం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

న్యాయస్థానం పరిధిలో..

ఏపీ హైకోర్టుని అమరావతిలోనే కొనసాగించాలా లేక కర్నూలుకి తరలించాలా అనేది న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారాయన. హైకోర్టు నిర్వహణ వ్యయం కూడ రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. హైకోర్టు రోజువారి పాలన వ్యవహారాల బాధ్యత సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదేనని అన్నారు.

రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ ధన్ గోపాల్ రావు అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటయిందని తన సమాధానంలో పేర్కొన్నారు కిరణ్ రిజిజు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టుని ఏపీ ప్రభుత్వం సంప్రదించిన తర్వాతే, పునర్విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేశారని, ఇప్పుడు కూడా కోర్టు తరలింపులో అదే పద్ధతి అమలు చేయాలని చెప్పారు. హైకోర్టు కర్నూలుకి తరలించే విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

ముందు విశాఖ..

మూడు రాజధానులు అంటున్న వైసీపీ ప్రభుత్వం ముందు విశాఖపైనే ఫోకస్ పెట్టింది. విశాఖను పాలనా రాజధానిగా చేయాలని ఉవ్విళ్లూరుతోంది. డెడ్ లైన్ కూడా ప్రకటించింది. పాలనా రాజధానిపై తొందరపడుతున్నారు సరే మాకిచ్చిన న్యాయ రాజధాని హామీ ఎంతవరకు వచ్చిందని సీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మాత్రం ప్రభుత్వం ఎటూ చెప్పలేకపోతోంది. న్యాయరాజధాని తరలింపు విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలు మొదలు కాలేదని తెలుస్తోంది. అమరావతిలో ఉన్నది హైకోర్టు తాత్కాలిక బిల్డింగ్. కనీసం కర్నూలులో అలాంటి బిల్డింగ్ కూడా లేదు. శాశ్వత భవనం ఏర్పాటు చేశాకే కోర్టుని తరలిస్తే బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  23 March 2023 1:36 PM GMT
Next Story