Telugu Global
Andhra Pradesh

నేతలు డబ్బులిచ్చి కేసులు వేయిస్తున్నారు- ఏపీ హైకోర్టు

పిటిషన్లలో నిజమైనవి చాలా తక్కువగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తెర వెనుక ఉంటూ డబ్బులిచ్చి మరీ ఇలాంటి పిటిషన్లు వేయిస్తున్నారని కోర్టు మండిపడింది.

నేతలు డబ్బులిచ్చి కేసులు వేయిస్తున్నారు- ఏపీ హైకోర్టు
X

వరుసపెట్టి దాఖలవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో నిజాయితీపై ఏపీ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు వెనకుండి అనేక పిటిషన్లు దాఖలు చేయిస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారికి గుణపాఠం చెప్పేలా జరిమానా విధించబోతున్నామని కోర్టు స్పష్టం చేసింది.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో బయోమెడికల్ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు పిల్ వేశారు. ఈ పిల్ విచారణ సందర్బంగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశంపై సింగిల్ బెంచ్ వద్ద కేసు పెండింగ్‌లో ఉండగానే ఆ విషయం తెలిసి కూడా మరోసారి పిటిషనర్లు వ్యాజ్యం వేశారని కాలుష్య నియంత్రణ మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు.

దాంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలా చేసినందుకు తప్పనిసరిగా పిటిషన్లకు భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అందుకు ఈ కేసు అన్ని విధాలుగా అర్హమైనది వ్యాఖ్యానించింది. పిటిషనర్లు నిరక్షరాస్యులని.. ఇది వరకే కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం వారికి తెలియదని పిటిషన్ల తరపు న్యాయవాది కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. అయినా ధర్మాసనం శాంతించలేదు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరుతో కొందరు కోర్టును దుర్వినియోగం చేస్తున్నారని, కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని.. దాఖలవుతున్న పిటిషన్లలో నిజమైనవి చాలా తక్కువగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తెర వెనుక ఉంటూ డబ్బులిచ్చి మరీ ఇలాంటి పిటిషన్లు వేయిస్తున్నారని కోర్టు మండిపడింది.

ఇలాంటి పిటిషన్లను అడ్డుకునేందుకు తాము చాలాకాలంగా ఎదురు చూస్తున్నామని.. సరైన గుణపాఠం చెప్పేందుకు, భారీ జరిమానా విధించేందుకు ప్రస్తుత కేసు సరైనదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎవరో డబ్బులిస్తే.. ఎవరో పిటిషన్లు వేస్తే వాటిని విచారించడం హైకోర్టు పనికాదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో భారీ జరిమానా విధించింది, తప్పుడు పిటిషన్లు వేసే వారికి గట్టి సందేశం పంపాలనుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో తప్పనిసరిగా జరిమానా విధిస్తామని అది ఎంత అనేది నిర్ణయించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

First Published:  7 Sept 2022 8:39 AM IST
Next Story