Telugu Global
Andhra Pradesh

సీలు లేకపోయినా ఓకే -హైకోర్టు

ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజులు సమయం ఉండటంతో.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది.

సీలు లేకపోయినా ఓకే -హైకోర్టు
X

పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. అధికారి సంతకం ఉంటే చాలు సీలు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. తమ తీర్పుపై ఇంకా అభ్యంతరం ఉంటే.. ఎన్నికల పిటిషన్(ఈపీ) దాఖలు చేసుకోవచ్చని వైసీపీ నేతలకు సూచించింది.

తీవ్ర వివాదం..

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై తీవ్ర వివాదం నెలకొంది. టీడీపీ ఆరోపణలకు స్పందిస్తూ, ఆ పార్టీకి అనుకూలంగా ఈసీ నిర్ణయం తీసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. సీలు లేకపోయినా పర్లేదు, పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు అని ఏపీ సీఈఓ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు వైసీపీ నేతలు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

సుప్రీంకోర్టుకి వైసీపీ..?

ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజులు సమయం ఉండటంతో.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేయాలని చూస్తోంది. మొత్తమ్మీద హైకోర్టు ఉత్తర్వులు వైసీపీకి సంతోషాన్నివ్వలేదనే చెప్పాలి, అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ మాత్రం వైసీపీ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

First Published:  2 Jun 2024 3:20 AM GMT
Next Story