‘చంద్రబాబు ముస్లింలను మరోసారి మోసం చేశాడు’
చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ముస్లింలను వరుసగా మోసం చేస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు. అవకాశవాద రాజకీయాలను, విధానాలను అనుసరిస్తున్న చంద్రబాబును ఈసారి కూడా ముస్లింలు నమ్మబోరని ఆయన అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్జుల తొలి జాబితాలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తొలి జాబితాలో 94 మంది పేర్లను ప్రకటించారని, అందులో ఒక్క ముస్లిం అభ్యర్థి పేరు మాత్రమే ఉందని, ఆ రకంగా ముస్లింలను చంద్రబాబు మరోసారి మోసం చేశారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజం అన్నారు.
చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ముస్లింలను వరుసగా మోసం చేస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు. అవకాశవాద రాజకీయాలను, విధానాలను అనుసరిస్తున్న చంద్రబాబును ఈసారి కూడా ముస్లింలు నమ్మబోరని ఆయన అన్నారు. టీడీపీలోని ముస్లిం నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ మైనారిటీలకు తగిన స్థానం కల్పిస్తోందని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు 94 మందిలో ఒక్క ముస్లింకు మాత్రమే సీటు కేటాయిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 67 మందిలో నలుగురు ముస్లింలకు స్థానం కల్పించారని, వారిలో ఓ మహిళ కూడా ఉందని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడు తన 2014-19 హయాంలో ముస్లింలను నిర్లక్ష్యం చేశారని, వారికి టికెట్లు కేటాయించలేదని, మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదని మైనారిటీ నేత డాక్టర్ మెహబూబ్ షేక్ అన్నారు. ఈసారి కూడా ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో ముస్లింల్లో ఒక్కరికి మాత్రమే స్థానం కల్పించారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనారిటీలను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబునే అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు.