Telugu Global
Andhra Pradesh

అంగన్వాడీ సమస్య.. తెగేదాకా లాగుతున్నారా..?

అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకోవడం ఇక్కడ ప్రధానాంశంగా మారింది. ఇరు వర్గాలు తగ్గేది లేదంటున్నాయి.

అంగన్వాడీ సమస్య.. తెగేదాకా లాగుతున్నారా..?
X

ఏపీలో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి మరీ వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందితో వాటిని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వాలంటీర్లకు డ్యూటీలు వేశారు. అంగన్వాడీలు సమ్మె విరమించే వరకు వారితో సర్దుబాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు అధికారులు. అంటే అంగన్వాడీల సమ్మె విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది.

మధ్యేమార్గం కూడా లేదా..?

జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఎంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారో, పెంచేది లేదని ప్రభుత్వం కూడా అంతే గట్టిగా చెబుతోంది. ఇక్కడే పీటముడి పడింది. చీటికీ మాటికీ జీతాలు పెంచాలనే డిమాండ్ ఏంటనేది ప్రభుత్వం వాదన. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో తమకు జీవనం గడవడంలేదనేది అంగన్వాడీల ఆవేదన. అవ్వాతాతలకిచ్చే పెన్షన్ ని ప్రభుత్వం 3వేల రూపాయలకు పెంచింది. ఆ నిష్పత్తిలో తమకు కూడా జీతాలు పెరగాలి కదా అని నిలదీస్తున్నారు అంగన్వాడీలు. ఇది సున్నిత సమస్య. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటివాటికి పరిష్కారం కనుక్కోవడం కష్టమే. అయితే ఎన్నికల ఏడాదిలో అంగన్వాడీ ఉద్యోగులందరూ వారం రోజులుగా రోడ్డెక్కి నిరసనలు తెలపడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు. కానీ దఫదఫాలుగా జరుగుతున్న చర్చలు విఫలమవుతున్నాయే కానీ ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం మాత్రం సాధ్యం కావడంలేదు.

జగన్ పెద్దమనసు చేసుకుంటారా..?

గత ప్రభుత్వాలకంటే తాము ఎక్కువగా ఇచ్చామని, అడిగినదానికంటే ఎక్కువే ఇచ్చామనేది ప్రభుత్వం వాదన. గతం కంటే నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని, జీవనం కష్టంగా మారిందని.. అంగన్‌వాడీ వర్కర్లకు రూ.26 వేలు, హెల్పర్లకు రూ.20 వేలుగా జీతాలను పెంచాలనేది వారి ప్రధాన డిమాండ్. కనీసం మధ్యేమార్గాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకోవడం ఇక్కడ ప్రధానాంశంగా మారింది. ఇరు వర్గాలు తగ్గేది లేదంటున్నాయి. తెగేదాకా లాగడం ఎవరికీ మంచిది కాదనే మాట వినపడుతోంది. మరి ఎవరు తగ్గుతారు, ఎవరు పెద్దమనసు చేసుకుంటారనేది వేచి చూడాలి.

First Published:  19 Dec 2023 9:14 AM IST
Next Story