ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు.. మళ్లీ చర్చలు, మళ్లీ పీటముడి
ఈ నెలాఖరులోపు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. 3వేల కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం వద్ద ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల నిధులు లేవు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశ పెడితే ప్రభుత్వం జమచేయాల్సిన మొత్తానికి మళ్లీ అప్పుచేయాల్సిన పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో పీఆర్సీ విషయంలో కూడా ఉద్యోగులకు నిరాశ తప్పలేదు. ఇది వాస్తవం. అయినా సరే ఉద్యోగులు పదే పదే డెడ్ లైన్లు పెట్టుకుంటూ కార్యాచరణ అంటూ ముందుకెళ్తున్నారు. పదే పదే ఉద్యోగుల్ని చర్చలకు పిలిచి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇందులో మరో ఎపిసోడ్ తాజాగా ముగిసింది. ఉద్యోగ సంఘాల నాయకులతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపింది. కేవలం పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కి మాత్రం ప్రభుత్వం ఓకే చెప్పింది. మార్చి-31 డెడ్ లైన్ పెట్టింది. అయితే ఇలాంటి డెడ్ లైన్లు గతంలో కూడా చాలానే దాటిపోయాయి కాబట్టి బిల్లులు క్లియర్ అయ్యే వరకు దీన్ని హామీగానే పరిగణించాల్సి ఉంటుంది.
సజ్జల ఏమన్నారంటే..?
ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం అన్నారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నామని చెప్పారు. కొవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని, ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడిందని అన్నారు. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిందన్నారు. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు. ఈ నెలాఖరులోపు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. 3వేల కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు.
బొప్పరాజు రియాక్షన్..
ఏపీ జేఏసీ అమరావతి తరపున చర్చల్లో పాల్గొన్న ఆ సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా చర్చల్లో పెండింగ్ డీఏలు క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని అన్నారు. పెండింగ్ డీఏల బకాయిలే ఎక్కువగా ఉంటాయని ఆయన గుర్తు చేశారు. పీఆర్సీ అరియర్స్ పై కూడా ప్రభుత్వం మరోసారి చర్చించి చెబుతామన్నదని అన్నారు బొప్పరాజు. సీపీఎస్ ఉద్యోగులకు చెందిన వాటాను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన, అయితే సీపీఎస్ రద్దు విషయంలో మాత్రం స్పష్టత రాలేదన్నారు. కార్యవర్గ సమావేశంలో చర్చించి, ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.