Telugu Global
Andhra Pradesh

పథకాల విషయంలో చంద్రబాబు ముందు జాగ్రత్త

పథకాలకు పేర్లు మార్చడంతోపాటు, పట్టాదార్ పాస్ పుస్తకాలపై కూడా జగన్ ఫొటోలు పెట్టుకుంటున్నారని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతలు. అదే విషయంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం తప్పు చేయకూడదనేది చంద్రబాబు ఆలోచన.

పథకాల విషయంలో చంద్రబాబు ముందు జాగ్రత్త
X

ఏపీలో 6 పథకాల పేర్లు మార్చారనేది అధికారిక సమాచారం. అయితే అది పేరు మార్పు కాదు, కేవలం పాత పేర్లను పునరుద్ధరించామని చెప్పుకుంటోంది కొత్త ప్రభుత్వం. పేరు మార్పు అంటే ప్రచారయావ అనుకునే ప్రమాదం ఉంది, అందుకే పాత పేర్లు పెట్టామని మాత్రమే కొత్త ప్రభుత్వం వివరణ ఇస్తోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది. గతంలో ఏ విషయంలో జగన్ ని టీడీపీ టార్గెట్ చేసిందో, అదే విషయంలో టీడీపీ కార్నర్ కాకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

పేర్లు మారిన ఆరు పథకాల్లో మూడింటికి ఎవరి పేర్లు జత చేర్చకపోవడం విశేషం. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని, అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యా నిధిగా పాత పేరే పెట్టి దళితులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గతంలో ఈ పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నారంటూ టీడీపీ విమర్శించింది, ఇప్పుడు పాత పేరే పునరుద్ధరించింది. ఇక విద్యా దీవెన, వసతి దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకంలో కూడా జగన్ అనే పేరు కనపడకుండా చేశారు. వైఎస్ఆర్ పేరున్న రెండు పథకాలకు కూడా పాత పేర్లే పెట్టారు. చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి అనేవి 2014 నుంచి 2019 వరకు అమలులో ఉన్న పథకాలే.

పథకాలకు పేర్లు మార్చడంతోపాటు, పట్టాదార్ పాస్ పుస్తకాలపై కూడా జగన్ ఫొటోలు పెట్టుకుంటున్నారని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేతలు. అదే విషయంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం తప్పు చేయకూడదనేది చంద్రబాబు ఆలోచన. అందుకే పథకాల విషయంలో ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, చంద్రన్న పేర్లు విరివిగా వాడేందుకు కూడా ఆయన ఉత్సాహం చూపించడంలేదు. మరోవైపు పవనన్న పేర్లతో కూడా కాంపిటీషన్ లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుంది.

First Published:  19 Jun 2024 2:49 AM GMT
Next Story