ఏపీలో అర్చకులకు దసరా కానుక
ఏపీలో అర్చకుల కనీస వేతనం రూ.15,625కి పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో అర్చకులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. అర్చకుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించారు. దసరా సందర్భంగా ఈ పెంపు అమలులోకి రాబోతోంది. ఏపీలో అర్చకుల కనీస వేతనం రూ.15,625కి పెంచుతూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని 1,177 మంది అర్చకులకు మేలు జరుగుతుంది.
బాకీ తీర్చేసుకున్న జగన్..
అర్చకుల కనీస వేతనం పెంపు అనేది గత ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ. అయితే ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అర్చకుల కనీస వేతనం పెంచుతూ జగన్ వారికి తీపి కబురు చెప్పారు. విజయదశమి సందర్భంగా అర్చకులకు ఇది శుభవార్త అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అటు అర్చక సమాఖ్య కూడా ఈ పెంపుపై సంతోషం వ్యక్తం చేసింది.
దసరా సందర్భంగా సీఎం జగన్, రేపు (శుక్రవారం) ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రభుత్వం తరపున ఆయన పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కనకదుర్గమ్మ జన్మనక్షత్రం సందర్భంగా రేపు ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.
♦