Telugu Global
Andhra Pradesh

విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్

సబ్ కమిటీ చర్చల్లో 2018 పే స్కేల్ ప్రకారం జీతాల పెంపుకి విద్యుత్ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని, ఆమేరకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు ఏపీ ట్రాన్స్ కో సీఎండీ కె.విజయానంద్.

విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్
X

ఏపీలో విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా తాత్కాలికంగా వాయిదా పడిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు సీఎం జగన్ అంగీకరించారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్ కోలో పని చేస్తున్న 27 వేలమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈమేరకు లబ్ధి చేకూరుతుంది. హైస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలు పెరుగుతాయి.

ఎవరెవరికి ఎంతెంత..?

హైస్కిల్డ్ కార్మికులకు రూ.22,589 నుంచి రూ. 30,605

స్కిల్డ్ కార్మికులకు రూ.20,598 నుంచి రూ. 27,953

సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,144 నుంచి రూ.23,236

అన్ స్కిల్డ్ కార్మికులకు రూ. 16,473 నుంచి రూ.22,318 కు వేతనాలు పెరుగుతాయి. సబ్ కమిటీ చర్చల్లో 2018 పే స్కేల్ ప్రకారం జీతాల పెంపుకి విద్యుత్ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని, ఆమేరకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు ఏపీ ట్రాన్స్ కో సీఎండీ కె.విజయానంద్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. జీతాల పెంపు ప్రకటనపై ఏపీ ట్రాన్స్ కో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఆగస్ట్-17న తలపెట్టిన మహా ధర్నా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విద్యుత్ ఉద్యోగులు.. తమ డిమాండ్లు పరిష్కరించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే విద్యుత్ ఉద్యోగులకు కూడా కనీసం 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించిన 8శాతం ఫిట్‌ మెంట్‌ ను స్ట్రగుల్ కమిటీ అంగీకరించడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్ యాజమాన్యాలే నేరుగా కార్మికులకు వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

First Published:  16 Aug 2023 4:52 PM IST
Next Story