Telugu Global
Andhra Pradesh

పవన్ ని కోర్టు మెట్లెక్కించబోతున్న జగన్

పవన్ కల్యాణ్ పై సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

పవన్ ని కోర్టు మెట్లెక్కించబోతున్న జగన్
X

పవన్ కల్యాణ్ వర్సెస్ వాలంటీర్లు అనే వివాదంలోకి ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురుద్దేశంతో కూడినవంటూ ప్రభుత్వం తేల్చింది. అందుకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ-వార్డు వాలంటీర్లు, సచివాలయల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్ పై సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 199/4 ప్రకారం కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ నెల 9న ఏలూరులో జరిగిన వారాహి సభలో.. ఏపీ లోని గ్రామ, వార్డు వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళల అక్రమ రవాణాకు సంబంధించి కీలక సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు చేరవేశారంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు సంబంధించి ఆయన వద్ద ఆధారాలేవీ లేవు. కేంద్రంలోని నిఘా సంస్థలు కొన్ని తనకు ఈ సమాచారాన్ని చేరవేశాయన్న పవన్, ఆ సంస్థల పేర్లు కానీ, సంబంధిత వ్యక్తుల పేర్లు కానీ, అలా సమాచారాన్ని సంఘవిద్రోహ శక్తులకు చేరవేస్తున్న వాలంటీర్ల పేర్లు కానీ బయటపెట్టలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దమ్ముంటే ఆ నిఘా సంస్థల వివరాలు బయటపెట్టాలని వైసీపీ నేతలు సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. అటు వాలంటీర్లు కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఊరూవాడా పవన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు, పవన్ ఫొటోలను మహిళా వాలంటీర్లు చెప్పులతో కొట్టారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ మహిళా కమిషన్ కూడా పవన్ కి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ వ్యవహారంలో నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కొసమెరుపు.

గతంలో కూడా బీజేపీ నేతలు వాలంటీర్లపై ఆరోపణలు చేశారు, టీడీపీ నేతలు కూడా వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ పవన్ కల్యాణ్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. వుమన్ ట్రాఫికింగ్ కి కారణం వాలంటీర్లేనంటూ నేరుగా ఆరోపణలు సంధించారు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. పవన్ ని కోర్టు మెట్లెక్కించబోతోంది.

First Published:  20 July 2023 7:56 PM IST
Next Story