Telugu Global
Andhra Pradesh

అది పాము కళేబరం కాదు.. ఏపీ ప్రభుత్వం వివరణ

ఐసీడీఎస్‌ పీడీ.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు. ఆ ప్యాకెట్ ని ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారని, అందులో ఎండు ఖర్జూరం ప్యాకెట్‌ ను మంగళవారం తెరిచినట్లు ఆమె పీడీకి చెప్పారు.

అది పాము కళేబరం కాదు.. ఏపీ ప్రభుత్వం వివరణ
X

వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. అంటూ గర్భిణిలు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహార ప్యాకెట్లలో పాము కళేబరం వచ్చిందంటూ ఏపీలో రచ్చ జరిగింది. ఖర్జూరం ప్యాకెట్ లో పాము కళేబరం బయటపడిందని వీడియో ఆధారాలతో ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ మొదలైంది. చిత్తూరు జిల్లా జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌ అంగన్‌ వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన ప్యాకెట్ లో పాము కళేబరం బయట పడిందని ముందు సోషల్ మీడియాలో ముందుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియా దాన్ని క్యాచ్ చేసింది. హైలైట్ చేసింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. దీనిపై ఈరోజు సాక్షి వివరణ ఇచ్చింది.

అది పాము కళేబరం కాదు..

ఐసీడీఎస్‌ పీడీ.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు. ఆ ప్యాకెట్ ని ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారని, అందులో ఎండు ఖర్జూరం ప్యాకెట్‌ ను మంగళవారం తెరిచినట్లు ఆమె పీడీకి చెప్పారు. అందులో పాము లాంటి వస్తువు ఉండడంతో ఆ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే అది పాము కళేబరమా కాదా అనేది మాత్రం తెలియలేదన్నారు.

ప్లాస్టిక్ వస్తువు..

ఐసీడీఎస్ పీడీ మాత్రం అది పాము కళేబరం కాదని అంటున్నారు. అది కేవలం ఓ ప్లాస్టిక్ వస్తువు మాత్రమేనని చెబుతున్నారు. పాము కళేబరం అయితే విరిగిపోయి ఉండేదని, కానీ అది గట్టిగా ఉందని ఆమె వివరణ ఇచ్చారు. ప్యాకింగ్ సమయంలో గట్టిగా ఉన్న ప్లాస్టిక్ వస్తువు ఎండు ఖర్జూరం ప్యాకెట్ లో కలసిపోయి ఉంటుందని అన్నారు. ఆ వస్తువు గట్టిగా ఉందని, అక్కడక్కడ పచ్చచుక్కలు ఉన్నాయని చెప్పారు. దాన్ని ల్యాబ్‌ కు పంపుతున్నట్టు వివరణ ఇచ్చారు. పాము కళేబరం ప్యాకెట్‌ లో ఉంటే వాసన వచ్చేదని అధికారులంటున్నారు.


First Published:  12 Oct 2023 7:54 AM GMT
Next Story