టెస్లా ప్లాంట్ మా దగ్గర పెట్టండి.. రేసులోకి వచ్చిన ఏపీ
కర్ణాటక, తెలంగాణ ఇప్పటికే ఈ ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా రేసులోకి వచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వనరులు తమ దగ్గర సమృద్ధిగా ఉన్నాయంటూ ఇప్పటికే రెండు ఈమెయిల్స్ పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా అధిపతి ఎలన్ మస్క్ ఈ నెల 22న ప్రధాని మోడీని కలవనున్న నేపథ్యంలో దేశమంతా ఆ భేటీపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టెస్లా ప్లాంట్ ఇండియాలో ఏర్పాటు చేయడానికి మస్క్ సుముఖంగా ఉన్నారని, ప్రధానితో భేటీలో దీనిపై మాట్లాడతారన్న సమాచారంతో అన్ని రాష్ట్రాలూ దాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ ఇప్పటికే ఈ ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా రేసులోకి వచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వనరులు తమ దగ్గర సమృద్ధిగా ఉన్నాయంటూ ఇప్పటికే రెండు ఈమెయిల్స్ పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానం
రాష్ట్రానికి వచ్చి, వారి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములు పరిశీలించుకోవాలని టెస్లా కంపెనీని ఆహ్వానించాం. వారి నుంచి ఇంకా స్పందన రాలేదు. చెన్నై, కృష్ణపట్నం ఓడరేవులతోపాటు బెంగళూరుకు సమీపంలో ఉన్నందున అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్‌కు సమీపంలో స్థలం ఉందని చెప్పాం. చెన్నై, కృష్ణపట్నం ఓడరేవులకు మరింత దగ్గరగా కావాలంటే నాయుడుపేటలోగానీ, శ్రీ సిటీలోగానీ భూములన్నాయని సూచించామని అని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇంతకు ముందే రెండుసార్లు ఆహ్వానం
టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు తమ రాష్ట్రానికి రావాలని ఆ సంస్థను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం 2021, 2022ల్లో రెండుసార్లు ఆహ్వానించింది. ఇప్పుడు మస్క్ ప్రధాని మోడీని కలవబోతున్నారన్న సమాచారంతో మరోసారి ఆహ్వానం పంపింది. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్లాంట్ ఏర్పాటు ప్రకటన ఈ భేటీలో వెలువడకపోవవచ్చని, దాని గురించి చర్చమాత్రం ఉంటుందని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.