ఆన్ లైన్ లో టెక్ట్స్ బుక్స్.. ఇది ఘనతా..? అసమర్థతా..?
విద్యా వ్యవస్థలో మార్పులు మంచివే. కానీ అసమర్థతను కప్పిపుచ్చుకోడాన్ని కూడా కొత్త విధానం అని డబ్బా కొట్టుకోవడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.
"పాఠ్య పుస్తకాల విషయంలో ఏపీ విద్యాశాఖ కొత్త విధానానికి బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్ లైన్ లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్ సైట్ లో ఫ్రీ డౌన్ లోడ్స్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. వెబ్ సైట్ నుంచి ఎవరైనా పీడీఎఫ్‌లను ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం నిషేధమని మంత్రి తెలిపారు." ఏపీ ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చిన వార్త ఇది.
ఆన్ లైన్ లో టెక్స్ట్ బుక్స్ పీడీఎఫ్ ని అందుబాటులో ఉంచడం కొత్త విధానమా..? పోనీ దాన్ని ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకోవడం కరెక్టేనా..? జూన్ లో పిల్లలు స్కూల్ కి వచ్చిన మొదటి రోజే అన్ని పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసి ఉంటే, దాన్ని ఘనతగా చెప్పుకోవచ్చు. అలాంటిది ఏడాది పూర్తయినా ఇంకా కొన్నిచోట్ల టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితులున్నాయి. ఆ కారణంతో ఓ ఎంఈవోని, డీఈవోని సదరు విద్యాశాఖ సెక్రటరీ సస్పెండ్ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ లో టెక్స్ట్ బుక్స్అందుబాటులో ఉంచామంటూ ప్రభుత్వం చంకలు గుద్దుకోవడం దేనికి..? ఆన్ లైన్ పుస్తకాలు ఎవరికోసం, దేనికోసం..? పోనీ వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం నిషేధం అంటున్నారు కదా.. ఎవరెవరు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారనేది ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది..?
ఆన్ లైన్ లో టెక్ట్స్ బుక్స్ అందుబాటులోకి తేవడం ఇప్పుడే మొదలైన వ్యవహారం కాదు. గత రెండేళ్లుగా ఏపీలో స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆన్ లైన్ లో అందుబాటులోనే ఉన్నాయి. ఆయా పుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ పాఠాలు నెట్టింట కనపడతాయి, వాటిని ప్రింట్ తీసుకోవచ్చు, లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రెండేళ్ల నుంచి ఉన్న పద్ధతినే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టామని చెబుతున్న నాయకులు, వారి అనుకూల మీడియా ఎవరిని మోసం చేయాలనుకుంటోంది..?
ప్రింటింగ్ విషయంలో చేతులెత్తేశారా..?
విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ వైసీపీ కంటే ముందున్న ప్రభుత్వాలు కూడా చేశాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ గత కొన్నేళ్లుగా సెమిస్టర్లంటూ పాఠ్యపుస్తకాల పంపిణీ సకాలంలో జరగడంలేదు. సంవత్సరం మధ్యలో కూడా కొన్ని పుస్తకాలు దొరక్క పిల్లలు ఇబ్బంది పడిన ఉదాహరణలున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు కూడా డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వమే పుస్తకాలు సరఫరా చేస్తుందని చెప్పి, అరకొర బుక్స్ ప్రింటింగ్ చేసి వారిని కూడా ఇబ్బంది పెట్టారు. పుస్తకాల పంపిణీ అస్తవ్యస్తంగా ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ దశలో ఆన్ లైన్ పుస్తకాలంటూ ఏపీ ప్రభుత్వం హడావిడి మొదలు పెట్టింది. రేపు స్టూడెంట్స్ ఎవరైనా తమకు పుస్తకాలివ్వలేదంటే.. ఆన్ లైన్ లో ఉన్నాయి ప్రింట్ తీసుకోండి అంటూ ఉచిత సలహాలివ్వడానికి అమాత్యులు ఏమాత్రం మొహమాట పడరు. విద్యా వ్యవస్థలో మార్పులు మంచివే. కానీ అసమర్థతను కప్పిపుచ్చుకోడాన్ని కూడా కొత్త విధానం అని డబ్బా కొట్టుకోవడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.