Telugu Global
Andhra Pradesh

చదువుల 'భారతి'కి జగన్ సాయం..

ఎస్కే యూనివర్శిటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జేఎల్ పోస్ట్ భారతికి కేటాయిస్తామన్నారు జిల్లా కలెక్టర్ గౌతమి. కెమిస్ట్రీలో జూనియర్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని, ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు.

చదువుల భారతికి జగన్ సాయం..
X

కూలీ పనులు చేసుకుంటూ PHD చేసిన డాక్టర్‌ సాకే భారతి ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారారు. ఆమె దీనస్థితి, కుటుంబ పరిస్థితి చూసి అందరూ షాకయ్యారు. అలాంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ, పిల్లలతోపాటు కుటుంబ పోషణ చూసుకుంటూ, కూలీపనులు చేస్తూ భారతి కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించడం నిజంగానే గొప్ప విషయం. అయితే ఆ గొప్పతనాన్ని స్థానిక నాయకులెవరూ గుర్తించకపోవడం విచారకరం. పైగా ఉద్యోగం అడిగితే స్థానిక ఎమ్మెల్యే తమను బయటకు తోసేశారని భారతి స్వయంగా చెప్పడంతో మరింత కలకలం రేగింది. భారతి విషయంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ, ఎట్టకేలకు ఆమెకు సాయం అందింది.

సీఎం జగన్ ఆదేశాలతో.. అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి ఈరోజు సాకే భారతిని కలెక్టరేట్ కి పిలిపించారు. ఏపీ ప్రభుత్వం తరపున 2 ఎకరాల స్థలాన్ని ఆమెకు కేటాయిస్తూ భూమి పట్టాను అందజేశారు. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని కూడా ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూలిపనులు చేస్తూ ఎస్కే యూనివర్శిటీలో కెమిస్ట్రీలో భారతి PHD పూర్తి చేయడం నిజంగా గొప్పవిషయం అని, భారతి జిల్లాకే గర్వకారణం అని ప్రశంసించారు కలెక్టర్ గౌతమి.

జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కూడా..

ఎస్కే యూనివర్శిటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జేఎల్ పోస్ట్ భారతికి కేటాయిస్తామన్నారు జిల్లా కలెక్టర్ గౌతమి. కెమిస్ట్రీలో జూనియర్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని, ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. మొత్తమ్మీద కాస్త ఆలస్యంగా అయినా భారతి కష్టాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించింది.

First Published:  31 July 2023 10:29 PM IST
Next Story