వలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు మంత్రి కారుమూరి తెలిపారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు.
ఏపీలో ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి గౌరవ భృతి పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడారు. వలంటీర్లకు గౌరవ భృతి రూ.750 అదనంగా అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనవరి 1 నుంచే ఇది అమలవుతుందన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు మంత్రి కారుమూరి తెలిపారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. మొదట్లో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తూ రేషన్ ఇప్పించేందుకు మాత్రమే వలంటీర్లను నియమించారు. ఆ తర్వాత వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేర్చే ఇతర బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో వలంటీర్ల పాత్ర కూడా ఉంటోంది. ప్రస్తుతం వలంటీర్లకు రూ. 5వేలు గౌరవభృతిగా అందజేస్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి వారికి రూ.5,750 అందజేయనుంది ప్రభుత్వం.