మంత్రి బొత్సకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వార్నింగ్
అధికారంలో ఉన్నాం కదా అని మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు.
ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ రోజు రోజుకీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. తమకి అనుకూల సంఘాల నాయకులతో మాత్రమే సమావేశమై, వారితో భజన ప్రెస్ మీట్లు పెట్టించడం ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఆ తర్వాత మెజార్టీ సంఘాలు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చీవాట్లు పెట్టడం సహజంగా మారింది. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా మంత్రి బొత్స సత్యనారాయణకు వార్నింగ్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. నవంబరు 1 నుంచి ఎప్పుడైనా నిరవధిక సమ్మె చేస్తామన్నారు.
అధికారంలో ఉన్నాం కదా అని మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు. ఇప్పటివరకు సహకరించామని, దీన్ని చేతగానితనంగా భావిస్తూ ఉద్యోగుల ఆత్మగౌరవంపై ప్రభుత్వం దెబ్బకొడుతోందని చెప్పారు. రాజమండ్రిలో ఏపీజీఈఏ సర్వసభ్య సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. అనుమతి లేకుండా ఉద్యోగుల ఖాతాల్లోంచి దాదాపు రూ.480 కోట్ల సొమ్మును 2022 మార్చిలో ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఈ విషయంలో ప్రభుత్వంపై కేసు పెట్టాలన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. గతంలో నేరుగా గవర్నర్ ని కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి కలకలం రేపారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు. ఆ తర్వాత గుర్తింపు రద్దు చేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించినా తగ్గేదే లేదంటున్నారు.
అటు ఏపీ జేఏసీ అమరావతి వర్గం కూడా ప్రభుత్వంపై రగిలిపోతోంది. ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రభుత్వం చులకనగా చూస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రతి ఉద్యోగి భుజం భుజం కలిపి ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపజేస్తామని హెచ్చరించారాయన. ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని ఉద్యోగులకు సూచించారు. విజయవాడలోని రెవెన్యూ భవన్ లో సమావశమైన జేఏసీ నాయకులు మూడోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. మే 8 నుంచి జూన్ 8 వరకు జరిగే ఉద్యమంలో అందరూ కలిసిరావాలన్నారు.
సచివాలయాల ఉద్యోగుల్నే గుర్తిస్తారా..?
ఏపీలో ఉద్యోగులతో ప్రభుత్వం ఎప్పుడు చర్చలు జరిపినా వెంటనే ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెరపైకి వస్తారు. ఆహా ఓహో అంటూ ప్రభుత్వాన్ని పొగిడేస్తారు. హామీలు వచ్చేశాయని, అమలుకి శ్రీకారం చుట్టారని చెబుతారు. కానీ వాస్తవంగా ఉన్న పరిస్థితి వేరు. ఉద్యోగులు రగిలిపోతున్నా ప్రభుత్వం బాగా లైట్ తీసుకుంటోంది. సీపీఎస్ రద్దు విషయాన్నే నాలుగేళ్లుగా నాన్చుతోంది. మిగతా సమస్యలదీ అదే దారి. ఎన్నికలనాటికి ఉద్యోగుల ఉద్యమాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.