అంగన్‌వాడీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు
చిన్నారులకు అవసరమైతే తక్షణ వైద్య సేవలు అందించేలా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వారికి జ్వరం, జలుబు లాంటి స్వల్ప అనారోగ్యం తలెత్తినా, చిన్న చిన్న గాయాలు తగిలినా తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందించింది.
పూర్వ ప్రాథమిక విద్యతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీల్లో మరిన్ని సౌకర్యాల కల్పనకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. చిన్నారులకు అవసరమైతే తక్షణ వైద్య సేవలు అందించేలా మరో ముందడుగు వేసింది. వారికి జ్వరం, జలుబు లాంటి స్వల్ప అనారోగ్యం తలెత్తినా, చిన్న చిన్న గాయాలు తగిలినా తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందించింది.
జలుబు, జ్వరం, చిన్నచిన్న గాయాలకు మందులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ఒక్కొక్కటి చొప్పున ఫస్ట్ ఎయిడ్ కిట్లను సరఫరా చేసింది. గతంలో పంపిణీ చేసిన కిట్లలో కంటే ఎక్కవ మందులను ఈ కిట్లలో పొందుపరిచారు. చిన్నపిల్లలు ఆడేటప్పుడు తగిలే చిన్న చిన్న గాయాలు, కొద్దిపాటి జలుబు, ఇతర చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ప్రథమ చికిత్స అందించేలా ఈ కిట్లలో పది రకాలకుపైగా మందులు ఉంటాయి.
పారాసిటమాల్ నుంచి ఐరన్ ట్యాబెట్ల వరకు..
ఈ అంగన్‌వాడీ మెడికల్ కిట్‌లో పారాసిటమాల్ సిరప్, ఐరన్ ట్యాబ్లెట్లు, అయోడిన్, సిల్వర్ సల్ఫాడైజీన్, క్లోరో ఫినరామిన్ మాలియాట్, ఫురాజోలిడిన్, హ్యాండ్ శానిటైజర్, రోలర్ బ్యాండేజ్, నియోమైసిన్ ఆయింట్‌మెంట్, కాటన్, సిప్రోఫ్లాక్సిన్ చుక్కల మందు వంటివి ఉన్నాయి. వీటిలో ఏ మందులను ఎలా ఉపయోగించాలో సమాచారాన్ని కూడా పంపించారు. ఈ మందులు ఎలా వినియోగించాలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు అవగాహన కూడా కల్పించారు.
నాలుగు రోజులకోసారి పరీక్షలు
అంగన్‌వాడీలను ఆ ఏరియా సచివాలయ ఆరోగ్య కార్యదర్శి, స్థానిక ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు మూడు, నాలుగు రోజులకోసారి పరిశీలిస్తారు. పిల్లల ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైనవారికి మందులు అందిస్తారు.