Telugu Global
Andhra Pradesh

పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం.. ఎస్ఐపీబీ సమావేశంలో జగన్

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని స్పష్టం చేశారు జగన్.

పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం.. ఎస్ఐపీబీ సమావేశంలో జగన్
X

ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు సీఎం జగన్. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసి, వారి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఆయా కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా వంటి ఇంధనాలను ఉత్పత్తి చేసే న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 110 కోట్లరూపాయల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేస్తారు. 2033నాటికి రెండు విడతలు పూర్తవుతాయి. రెండు విడతల్లో 61 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అవిశా ఫుడ్స్‌ సంస్థ రూ. 498.84 కోట్ల పెట్టుబడితో రోజుకు 500 కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇథనాల్‌ తయారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి లభిస్తుంది. కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ రూ. 3,400 కోట్ల పెట్టుబడులతో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీకాళహస్తిలో రూ. 915.43 కోట్లు, పుంగనూరులో రూ. 171.96 కోట్ల పెట్టుబడులతో డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్‌ తయారీ పరిశ్రమలు ఏర్పాటుకి ప్రభుత్వ సమ్మతి. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,350 మందికి ఉపాధి.

రామాయపట్నంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో ప్రత్యేక ఖనిజాల తయారీ పరిశ్రమకు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుపతిలో టెలి కమ్యూనికేషన్‌ ఇంటిగ్రేషన్‌, సెమికండక్టర్‌, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అనుమతులిచ్చింది. భోగాపురంలో 90 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టారు. రూ. 7,210 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 14,825 మంది, పరోక్షంగా 5,625 మందికి ఉపాధి లభిస్తుంది.

First Published:  8 Feb 2023 1:31 PM IST
Next Story