ఏపీలో కొవిడ్ మరణాలు పెరుగుతున్నాయా..? ప్రభుత్వం ఏమంది..?
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏపీలో మరణాలు పెరుగుతున్నాయనే పుకార్లు మొదలయ్యాయి.
ఏపీలో కొవిడ్ మరణాలు భారీగా పెరుగుతున్నాయంటూ మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫలానా జిల్లాలో 10మంది, ఫలానా జిల్లాలో ఐదుగురు అంటూ లిస్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇలాంటి వార్తలు రావడంతో.. ప్రభుత్వం అలర్ట్ అయింది. అవన్నీ వట్టి పుకార్లేనంటూ కొట్టిపారేసింది. కొవిడ్ మరణాలపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏపీలో మరణాలు పెరుగుతున్నాయనే పుకార్లు మొదలయ్యాయి.
ఈ పుకార్లపై వివరణ ఇచ్చారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్. కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తి వైరల్ న్యుమోనియా వల్ల మృతిచెందినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని కమిషనర్ వెల్లడించారు. అయితే ప్రసాద్ కి ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అతను కరోనా వల్ల చనిపోయారంటూ వార్తలొచ్చాయని, అది అవాస్తవం అన్నారు. అతని మరణానికి కారణం వైరల్ న్యుమోనియా అని క్లారిటీ ఇచ్చారు.
కాకినాడలోనే 26 ఏళ్ల సందీప్ కి ఆర్టీపీసీఆర్ పరీక్షలో కొవిడ్ పాజిటివ్ వచ్చినా, ఆయన మరణానికి కారణం సైక్రోటైజింగ్ ప్యాంక్రియాలైటిస్ అని తేలిందని చెప్పారు జె.నివాస్. విశాఖపట్నంలో పి.చింటో అనే యువకుడు కూడా వైరల్ న్యుమోనియాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారని, అతనికి చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో కొవిడ్ నెగెటివ్ గా తేలిందన్నారు.
ఈ ఉదాహరణన్నీ కలిపి కొవిడ్ కేసుల్లో లెక్కగట్టారని, కానీ వాస్తవం వేరుగా ఉందని చెప్పారు. ఏపీలో కొవిడ్ మరణాల సంఖ్య ఉధృతంగా లేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ హితవు పలికారు.