ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం
ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై, రోడ్డు మార్జిన్లలో.. సభలు, ర్యాలీలను అనుమతించేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఏపీలో వరుసగా జరుగుతున్న దుర్ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను వైసీపీ ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై, రోడ్డు మార్జిన్లలో.. సభలు, ర్యాలీలను అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్లు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది. ఈమేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలను బలవుతున్నాయని చెప్పిన హోం శాఖ, 1861 పోలీస్ చట్టం ప్రకారం 30 పోలీస్ యాక్ట్ ని అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులను పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. సభలు, సమావేశాల నిర్వ-హణకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయా¬లని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది.
ఇటీవల కందుకూరు టీడీపీ సభలో 8మంది చనిపోగా, గుంటూరులో జరిగిన తొక్కిసలాట ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. వరుస దుర్ఘటనలపై కేసులు నమోదయ్యాయి, విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో రాజకీయ వేడి కూడా మొదలైంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు దుర్ఘటనలకూ టీడీపీ సభలే కారణం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై కూడా పలు విమర్శలు వినపడుతున్నాయి. దీంతో పోలీస్ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. 30 యాక్ట్ అమలుకి సిద్ధమైంది. ఈమేరకు హోం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదేం ఖర్మకు బ్రేక్ పడినట్టేనా..?
ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు.. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ర్యాలీలు, బహిరంగ సభలు పెడుతున్నారు. ఈ సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే దుర్ఘటనల కారణంగా విమర్శలు కూడా చెలరేగాయి. ప్రస్తుతం హోం శాఖ ఉత్తర్వులతో చంద్రబాబు పర్యటనలపై ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. రోడ్లపై ర్యాలీలకు అనుమతి ఉండదు. సభలు, సమావేశాలు కూడా ఊరికి దూరంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ వారాహి వాహన యాత్ర, నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఎలాంటి మినహాయింపులు ఉంటాయో చూడాలి.