Telugu Global
Andhra Pradesh

జీవో-1పై హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మాత్రం జీవో అమలుపై పట్టుదలతో ఉంది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్ట్ లో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం.

జీవో-1పై హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
X

రోడ్లపై సభలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ని హైకోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ఆ జీవోని రద్దు చేసిన హైకోర్టు.. ఈనెల 20న దానిపై తుదితీర్పు ఇస్తామని తెలిపింది. అయితే ఆలోగా హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్ట్ లో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం.

కందుకూరు, గుంటూరు వరుస దుర్ఘటనల తర్వాత.. సభలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ, అత్యవసరమైతే పోలీస్ పర్మిషన్ తప్పనిసరి చేస్తూ జనవరి-2న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్-1 విడుదల చేసింది. దీనిపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. ఆ జీవో విడుదలైన తర్వాత కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరింత రాజకీయ రచ్చ మొదలైంది. ఈ జీవో అమలుని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, సభలు, సమావేశాలకు పోలీసుల అనుమతి ఎందుకని ప్రశ్నించారు.

ఈ పిల్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు జీవో అమలుని నిలిపివేసింది. ఈనెల 23వరకు జీవోని రద్దు చేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈనెల 20నే దీనిపై తుదితీర్పు ఇస్తామని కూడా చెప్పింది. ఏపీ ప్రభుత్వం మాత్రం జీవో అమలుపై పట్టుదలతో ఉంది. జీవో అమలు విషయంలో కోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించాలని, వరుస దుర్ఘటనలకు కారణం సభలు, సమావేశాలేనని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవో అమలు రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మరి సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, హైకోర్టులో తుది విచారణ పూర్తయ్యాక రావాలని చెబుతుందా, లేక మధ్యలో కలుగజేసుకుంటుందా అనేది వేచి చూడాలి.

First Published:  17 Jan 2023 6:14 PM IST
Next Story