Telugu Global
Andhra Pradesh

తగ్గిన తుపాను ప్రభావం.. ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం

తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కుటుంబానికి గరిష్టంగా 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

తగ్గిన తుపాను ప్రభావం.. ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం
X

ఏపీలో మాండూస్ తుపాను ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారం అర్థరాత్రి తర్వాత తుపాను మహాబలిపురం వద్ద తీరం దాటగా.. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం ఉదయం కూడా వర్షాలు కొనసాగినా, సాయంత్రానికి వరుణుడు శాంతించాడు. అక్కడక్కడా చిరుజల్లులు మాత్రం పడుతున్నాయి.

32మండలాలపై తీవ్ర ప్రభావం..

కోస్తా జిల్లాలతో పాటు కడప, చిత్తూరు జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించింది. 32 మండలాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 33 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 778 మందికి పునరావాసం కల్పించారు. సహాయక చర్యలకోసం ప్రకాశం జిల్లాకు 2, నెల్లూరుకి 3, తిరుపతికి 2, చిత్తూరుకు 2.. మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సహాయక చర్యలు చేపట్టారు.

ఆర్థిక సాయం..

మాండూస్ తుపాను బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తుపాను ప్రభావానికి గురైన వ్యక్తులకు వెయ్యి రూపాయలు, కుటుంబానికి గరిష్టంగా 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేప్పుడు ఈ ఆర్థిక సాయం అందిస్తారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో 10 నుంచి 12 వేల ఎకరాల్లో రైతులు వరి పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. టమోట, క్యాబేజీ, మిర్చి పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. వీరందరికీ బీమా సొమ్ము అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

First Published:  11 Dec 2022 5:19 PM IST
Next Story