Telugu Global
Andhra Pradesh

జగన్‌పై మాత్రమే విమర్శలా..? - శ్రీనివాస్‌ రెడ్డికి అమర్ కౌంటర్

తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబునాయుడు ఎలాంటి చట్టం తెచ్చారో గుర్తు లేదా అని నిలదీశారు.

జగన్‌పై మాత్రమే విమర్శలా..? - శ్రీనివాస్‌ రెడ్డికి అమర్ కౌంటర్
X

జగన్‌ ప్రభుత్వంపై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చేసిన విమర్శలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ అభ్యంతరం తెలిపారు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి.. జగన్‌ పాలన కంటే చంద్రబాబు పాలనే బాగుండేది అంటూ మాట్లాడారు. మీడియాను జగన్ అణచివేస్తున్నారని ఆరోపించారు.

శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు దేవులపల్లి అమర్ కౌంటర్ ఇచ్చారు. నిన్నటి సమావేశం జర్నలిస్టుల కోసం కాకుండా టీడీపీకి మద్దతుగా నిర్వహించినట్టుగా ఉందని విమర్శించారు. జగన్‌ను ఎప్పుడెప్పుడు దించేసి చంద్రబాబును సీఎంను చేద్దామా అని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే అలాంటి పక్షాలను జర్నలిస్టుల సమావేశానికి పిలిచి మాట్లాడిస్తే జర్నలిస్టులకు ఎలా ఉపయోగకరమని ప్రశ్నించారు అమర్.

నిత్యం వ్యతిరేకంగా కథనాలు రాస్తూ, చర్చలు పెడుతున్న పత్రికలను, మీడియా చానళ్లను జగన్‌ అణచివేయడం లేదు కాబట్టి ఆయన పాలన నచ్చడం లేదా అని శ్రీనివాస్‌ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అక్కడి ప్రభుత్వం అమలు చేయడం లేదని.. మరి తెలంగాణకే చెందిన శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అమర్ నిలదీశారు.

తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో మీడియాను నియంత్రించేందుకు చంద్రబాబునాయుడు ఎలాంటి చట్టం తెచ్చారో గుర్తు లేదా అని నిలదీశారు. 2014లో మరోసారి సీఎం అయిన తర్వాత కూడా మీడియాపైన, కొందరు జర్నలిస్టులపైన చంద్రబాబు ప్రభుత్వం ఎలా కక్షపూరితంగా వ్యవహరించిందో శ్రీనివాస్‌ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపైన, కేసీఆర్‌ ప్రభుత్వంపైన విమర్శలు చేయని శ్రీనివాస్ రెడ్డి.. కేవలం జగన్‌ ప్రభుత్వంపై మాత్రం రాజకీయ విమర్శలకు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు.

First Published:  14 Jun 2023 6:33 PM IST
Next Story