Telugu Global
Andhra Pradesh

అప్పర్ భద్రపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం

ఈ ప్రాజెక్టు కారణంగా తుంగభద్ర డ్యాం, కేసీ కెనాల్, ఆర్డీఎస్, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అప్పర్ భద్రపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం
X

ఏపీకి ఎగువన కర్నాటక రాష్ట్రం చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కర్నాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నీటి కేటాయింపులు లేకున్నా 29.9 టీఎంసీల మేర తుంగభద్ర జలాలను వాడుకునేందుకు కర్నాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. పనులు కూడా ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టు కారణంగా తుంగభద్ర డ్యాం, కేసీ కెనాల్, ఆర్డీఎస్, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కల్పించిన జాతీయ హోదాను, కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులను రద్దు చేసేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్ వేయనుంది.

ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులే లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల అభిప్రాయాలు తెలుసుకోకుండా అప్పర్ భద్రకు 2020 డిసెంబర్‌ 24న సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వడాన్ని ఏపీ తప్పుపడుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ, తెలంగాణలో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.

First Published:  5 Feb 2023 8:21 AM IST
Next Story