ఫేక్ జీవో ఎవరి పనో?
ఉద్యోగుల విరమణ వయసు పెంపునకు సంబంధించిన ఫేక్ జీవో వైరల్ అవటంపై టీడీపీపై అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని రెండు రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు టీడీపీ కుట్ర చేసినట్లు వైసీపీ భావిస్తోంది.
ఉద్యోగుల విరమణ వయసు పెంపునకు సంబంధించినను 65 ఏళ్ళకి ప్రభుత్వం పెంచినట్లు ఒక జీవో బాగా సర్క్యులేట్ అయ్యింది. దీన్ని చూసిన ఉద్యోగుల్లో చాలామంది నిజమే అనుకున్నారు. ఇదే సమయంలో మరికొందరు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున మండిపోయారు. జీవోని ఆధారంగా చేసుకుని ఎల్లో మీడియాతో పాటు టీడీపీకి అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియా గ్రూపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయాయి. అయితే ఉద్యోగ విరమణ పెంచే జీవోపై ఎంత తొందరగా గొడవ మొదలైందో అంతే తొందరగా సద్దుమణిగిపోవటం విచిత్రంగా ఉంది.
ఇక్కడే అందరికీ జీవో సర్క్యులేషన్లోకి ఎలా వచ్చిందనే విషయమై అనుమానాలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో మంత్రులు, వైసీపీ నేతల్లో కొందరు టీడీపీపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ వయసు ప్రభుత్వం 63 ఏళ్ళకి పెంచే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చింది. అయితే వైరల్ అయిన జీవోపై ప్రభుత్వం వెంటనే స్పందించి అదంతా ఫేక్ జీవో అని తేల్చేసింది. అంతేకాకుండా ఫేక్ జీవో సర్క్యులేట్ చేస్తున్నవాళ్ళపై ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఫేక్ జీవో వైరల్ అవటంపై టీడీపీపై అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాన్ని రెండు రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు టీడీపీ కుట్ర చేసినట్లు వైసీపీ భావిస్తోంది. మొదటి పాయింట్ ఏమిటంటే విరమణ చేసే ఉద్యోగులకు ఆర్థిక బెనిఫిట్స్ చెల్లించలేకే ప్రభుత్వం విరమణ వయసు పెంచిందని దుష్ప్రచారం చేయటం.
ఇక రెండో పాయింట్ ఏమిటంటే నిరుద్యోగులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం. ఉద్యోగాలు భర్తీ చేయటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలైందని ప్రచారం చేయటానికి టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయకుండా ఉద్యోగుల విరమణ వయసు పెంచుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నట్లు టీడీపీని అనుమానిస్తున్నారు. నిజానికి విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేల కోట్ల రూపాయలను ఇవ్వలేకే చంద్రబాబు 2014 జూన్‌లో విరమణ వయసును 58 నుండి 60కి పెంచిన విషయం అందరికీ తెలిసిందే. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ విరమణ వయసును 60 నుండి 62కి పెంచారు. పోలీసుల విచారణలో ఏమి బయటపడుతుందో చూడాలి.