ఇక నుండి మంత్రులకే సలహాదారులు
కేసు విచారణలో ఉండగానే సలహాదారుల రూపును మార్చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. శాఖలకు సలహదారులను కాకుండా మంత్రులకు సలహాదారులను నియమించబోతున్నట్లు హైకోర్టుకు స్పష్టం చేసింది. శాఖల సలహాదారు పదవులను రీ డిజిగ్నేట్ చేసి మంత్రులకు సలహాదారులుగా మార్చబోతున్నట్లు అఫిడవిట్‌లో చెప్పింది.
హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సలహాదారుల రూపు మారుతోంది. సలహాదారుల నియామకాలపై కొందరు హైకోర్టులో పిటీషన్లు వేశారు. సలహాదారుల నియామకాలపై కోర్టు సీరియస్‌గానే వ్యాఖ్యలు చేస్తోంది. సలహాదారుల నియామకంలో రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తామంటు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు శాఖలకు సలహాదారులేమిటి అని కూడా కోర్టు ఆశ్చర్యపోయింది. శాఖలకు సలహాదారులను నియమించటం వల్ల సమాంత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా అభిప్రాయపడింది.
దాంతో ప్రభుత్వం ఏమనుకున్నదో ఏమో కేసు విచారణలో ఉండగానే సలహాదారుల రూపును మార్చేయాలని డిసైడ్ అయ్యింది. శాఖలకు సలహదారులను కాకుండా మంత్రులకు సలహాదారులను నియమించబోతున్నట్లు హైకోర్టుకు స్పష్టం చేసింది. శాఖల సలహాదారు పదవులను రీ డిజిగ్నేట్ చేసి మంత్రులకు సలహాదారులుగా మార్చబోతున్నట్లు అఫిడవిట్‌లో చెప్పింది. కొత్త రూపానికి మంత్రివర్గం ఆమోదం చెప్పిన వెంటనే అమల్లోకి తెస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
సలహాదారులను కూడా అవినీతి చట్టపరిధిలోకి తేబోతున్నట్లు కోర్టుకు వివరించింది. సబ్జెక్టుల్లో నిపుణులనే ఇకనుండి మంత్రులకు సలహాదారుగా నియమించబోతున్నట్లు అఫిడవిట్లో ప్రభుత్వం చెప్పింది. సలహాదారుల నియామకం విషయంలో గతంలోలాగే కన్సల్టెంట్, కన్సల్టెంట్ ఏజెన్సీ పేర్లతో నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం అదనపు అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది. సరే ప్రభుత్వం తాజా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రభుత్వంలో ఎవరున్నా ఏదో రూపంలో తమకు కావాల్సిన వారికి పోస్టులిచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సలహదారుల పేరుతో నియమించుకుంటే ఇంతకుముందు చంద్రబాబునాయుడు కన్సల్టెంట్ల పేరుతో నియమించుకున్నారు. చంద్రబాబు కూడా తన ఇష్టం వచ్చినంతమందిని కన్సల్టెంట్లను నియమించుకున్నారు. వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఏమిటి ఉపయోగమంటే ఏమీలేదనే చెప్పాలి. అప్పుడైనా ఇప్పుడైనా వృధా అయ్యేది ప్రజాధనమే. కాకపోతే అప్పట్లో చంద్రబాబు చేశారు కాబట్టి అంతా ఒప్పు అయింది. అదే పనిని ఇప్పుడు చేస్తుంది జగన్ కాబట్టి తప్పు అయ్యిందంతే. రాజకీయంగా తమకు కావాల్సినవాళ్ళని అందలాలు ఎక్కించటానికి సలహాదారులు లేకపోతే కన్సల్టెంట్లు అనేది ఒక మార్గమని అందరికీ తెలిసిందే. చూద్దాం ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో.