Telugu Global
Andhra Pradesh

టిడ్కో ఇళ్ల నెలవారీ మెయింటెనెన్స్ రూ.150

టిడ్కో సముదాయంలో పారిశుధ్య నిర్వహణ, లైటింగ్, వాటర్ పైప్‌ల నిర్వహణ వంటివాటిని ప్రస్తుతానికి ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. కానీ ముందు ముందు ఆ బాధ్యతలను టిడ్కో ఇళ్ల కమిటీలకే అప్పగించాలని భావిస్తోంది.

టిడ్కో ఇళ్ల నెలవారీ మెయింటెనెన్స్ రూ.150
X

టిడ్కో అపార్ట్‌మెంట్ల వ్యవహారంలో మెయింటెనెన్స్ ఫీజు వసూలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. భోపాల్‌ పీఎంఏవై–యు పథకం కింద నిర్మించిన ప్లాట్లను ఏపీ టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారుల బృందం తాజాగా పరిశీలించింది. అక్కడ కూడా మెయింటెనెన్స్ ఫీజు వసూలు చేస్తున్నారని, అదే ఇక్కడ ప్రవేశపెడతామంటున్నారు అధికారులు. అయితే భోపాల్‌లో ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.850 వసూలు చేస్తున్నారని, ఏపీలో నెలకు రూ.150 గరిష్ట పరిమితి విధించబోతున్నట్టు తెలిపారు.

వ్యక్తిగత ఇళ్ల విషయంలో నిర్వహణ లేకపోతే నష్టపోయేది ఆ ఒక్క యజమాని మాత్రమే, కానీ అపార్ట్ మెంట్లలో ఒక్కరు కలసిరాకపోయినా మొత్తం నష్టపోతారు. రాజీవ్ స్వగృహ అనే పేరుతో గతంలో వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన అపార్ట్ మెంట్లు నిరుపయోగంగా మారింది ఇలాగే. తాజాగా టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూడా నిర్వహణ సమస్యగా మారుతోంది. టిడ్కో సముదాయంలో పారిశుధ్య నిర్వహణ, అపార్ట్ మెంట్ల మధ్య లైటింగ్, డ్రైనేజీ నిర్వహణ, మంచినీటి ట్యాంక్ నిర్వహణ వంటివాటిని ప్రస్తుతానికి ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. కానీ ముందు ముందు వాటిని టిడ్కో ఇళ్ల కమిటీలకే అప్పగించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రతి ఇంటి నుంచి నెలవారీగా 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వసూలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.

భోపాల్‌లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి అపార్ట్ మెంట్లు కేటాయించారు. అక్కడ లబ్ధిదారుల నుంచి నెలకు రూ.850 వసూలు చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, అంతర్గత రోడ్ల శుభ్రత వంటి వాటి కోసం ఆ సొమ్ము వినియోగిస్తున్నారు. ప్రతి వెయ్యి అపార్ట్ మెంట్లకు ఓ కమిటీ ఏర్పాట చేసి, ఆ డబ్బు వారివద్ద జమ చేసి జాగ్రత్తగా ఖర్చుపెడుతున్నారు. ఏపీలో కూడా అపార్ట్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి మెయింటెనెన్స్ సొమ్ము వారి ద్వారా ఖర్చు చేయాలని చూస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎలాగూ ఉంటుంది.

మిగతావి ఎప్పుడు..?

ఏపీలో టిడ్కో ఇళ్ల వ్యవహారం 2019 నుంచి నత్తనడకన సాగుతోంది. టీడీపీ తమ హయాంలో ఇళ్లు పూర్తి చేశామంటోంది, వైసీపీ తమ హయాంలో రంగులేస్తున్నామని చెబుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో రంగులు పూర్తయ్యాయి. కొన్నాళ్లు కరోనా క్వారంటైన్ సెంటర్లుగా వీటిని వాడుకున్నారు, ఈ ఏడాది మెల్లిమెల్లిగా కేటాయింపులు మొదలుపెట్టారు. కొన్నిచోట్ల ఇంకా మౌలిక వసతులు పూర్తి కాలేదని, కేటాయించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అప్పగించలేదు. ఎన్నికల నాటికి టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం.

First Published:  21 Nov 2022 8:03 AM IST
Next Story